Jul 12,2023 23:34

మహిళా జాతా కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఐద్వా నాయకులు

ప్రజాశక్తి- చింతూరు
హింసపై పోరుయాత్ర పేరుతో ఈ నెల 28 నుండి ఆగస్టు 9వ తేదీ వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహిళా జాతాను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్‌.రమణి పిలుపునిచ్చారు. ఐద్వా ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కమిటీ సమావేశంలో కుంజా రాధ అధ్యక్షతన బుధవారం చింతూరులో జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రమణి మాట్లాడుతూ మహిళలపై దాడులు, హింస రోజు రోజుకు పెరిగి పోతున్నాయని, వీటిని అరికట్టడానికి సమాజంలోని అందరూ పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు మద్యం, మత్తు పదార్థాలు, అశ్లీలతను పెంచి పోషిస్తున్నాయని, అందుకే ఈ దారుణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలను నివారించేందుకు, ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఐద్వా ఈ యాత్రను చేపట్టిందని తెలిపారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ఐ.పద్మావతి మాట్లాడుతూ జిల్లాలో కూడా మహిళలపై జరుగుతున్న దాడులు, హింసకు వ్యతిరేకంగా మహిళలు, ప్రజలంతా పోరాటాల్లోకి రావాలని, ఇక్కడ జరిగే జాతాలో మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జాతాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సమావేశంలో ఐద్వా నాయకులు ముర్రం రంగమ్మ, కారం లక్ష్మి, జ్యోతి, సోయం వీరమ్మ, యెడమ సుబ్బమ్మ, కారం జయమ్మ తదితరులు పాల్గొన్నారు.