Aug 11,2023 21:47

మాట్లాడుతున్న రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ అప్పారావు

* రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ కె.అప్పారావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలను నిరోధించేందుకు మహిళా పోలీసులు కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు, సభ్యులు గొండు సీతారాం, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యులు గెడ్డం ఉమ అన్నారు. నగరంలోని మహిళా డిగ్రీ కళాశాలలోని సమావేశ మందిరంలో బ్రెడ్స్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యాన 150 గ్రామాల మహిళా సంక్షేమ కార్యదర్శులు, సిబ్బందికి బాల్య వివాహాలను నిర్మూలనపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్న వారిపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలన్నారు. మహిళా సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, కిశోర బాలికలు, యువత, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పురోహితులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాల్లో బాలల చట్టాలపై పోస్టర్లను ప్రదర్శించాలని తెలిపారు. సమావేశంలో దిశ డిఎస్‌పి వాసుదేవ్‌, బాలల సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి, సభ్యులు గన్నెప్పడు, డిసిపిఒ రమణమూర్తి, బ్రెడ్స్‌ ప్రతినిధి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.