Apr 02,2023 22:21

నిబంధనలకు విరుద్ధంగా గ్రామాలు దాటి విధుల కేటాయింపు
పలుచోట్ల మహిళా పోలీసులపై సిఐ, ఎస్‌ఐల తీరు దారుణం
అర్ధరాత్రి వరకూ బందోబస్తు, ఆదివారం, పండుగ దినాల్లోనూ విధులు
ప్రశ్నిస్తే షోకాజ్‌ నోటీసుల పేరుతో బెదిరింపులు
ఐదు గంటల వరకూ సచివాలయంలో.. ఆపై బందోబస్తు పనులు
తల్లడిల్లుతున్న మహిళా పోలీసులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా పోలీసులకు (మహిళా సంరక్షణ కార్యదర్శులు) అసలు జాబ్‌చార్ట్‌ ఉందా.. వీరికి విధుల కేటాయింపు నిబంధనల ప్రకారం జరుగుతుందా.. పోలీస్‌ ఉద్యోగుల మాదిరిగా అర్ధరాత్రి వరకూ బందోబస్తు విధులు, ఆదివారం, పండుగ దినాల్లో విధులు కేటాయించొచ్చా.. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ సచివాలయంలో పని చేసిన మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఐదు గంటల తర్వాత విధులు కేటాయించొచ్చా వంటి పలు ప్రశ్నలకు సమాధానం లేకుండాపోయింది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 900కుపైగా గ్రామ సచివాయాలు ఉన్నాయి. ప్రతి గ్రామ సచివాలయానికి ఒక మహిళా సంరక్షణ అధికారిని ప్రభుత్వం నియమించింది. వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, డిజిటల్‌ అసిస్టెంట్లు మాదిరిగానే వీరు కూడా పరీక్షలు రాసి ఈ ఉద్యోగంలో చేరారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు చేయాల్సిన విధుల గురించి ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. గ్రామ సచివాలయ పరిధిలో నేరాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీస్‌ స్టేషన్‌లకు ఇవ్వడం, మహిళలకు సంబంధించిన కేసులు సచివాలయ పరిధిలో జరిగితే హాజరుకావడం, సచివాలయ పరిధిలోని అంగన్‌వాడీలను సందర్శించడం, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి చట్టాలపై అవగాహన కల్పించడం, గ్రామస్తులకు చట్టాల గురించి తెలియజేయడం వంటి విధులున్నాయి. పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో వీరు పని చేయాల్సి ఉంటుందని పేర్కొంది. వీరికి సంబంధించి డిడిఒ అధికారం కూడా పంచాయతీ కార్యదర్శికే ఉంది. తర్వాత కాలంలో వీరికి యూనిఫారం ఇచ్చి పోలీస్‌ సిబ్బందిగా పరిగణించాలని ప్రభుత్వం ప్రయత్నించింది. కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వం ఆ జిఒను వెనక్కి తీసుకుని యూనిఫారం వంటి వాటిని విరమించుకుంది. ఇంకా కోర్టులో ఈ కేసు విచారణలో ఉంది. ఎందుకంటే మహిళా సంరక్షణ అధికారులు పోలీస్‌ ఉద్యోగానికి సంబంధించిన ఎటువంటి ఫిజికల్‌ టెస్టులు పాస్‌ కాలేదు. వీరు సచివాలయ పరిధిలో ఉద్యోగాలు పొందినవారు మాత్రమే. అంతర్‌ జిల్లాల బదిలీలు లేక భార్యాభర్తలు వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా సంరక్షణ కార్యదర్శులు పెద్దసంఖ్యలో ఉన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా విధులు..?
మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉదయం పది గంటలకు సచివాలయానికి వెళ్లి బయోమెట్రిక్‌ వేయాలి. సాయంత్రం ఐదు గంటలకు డ్యూటీ ముగిసిన తర్వాత వీరిని పోలీస్‌ స్టేషన్లకు పిలిచి విధులు కేటాయిస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్రామ సచివాలయ పరిధి దాటి విధులు కేటాయించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ఎందుకంటే వారికిచ్చిన ఉద్యోగమే గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి. అయితే అర్ధరాత్రి వరకూ వేరే ప్రాంతాల్లో బందోబస్తు విధులు కేటాయిస్తున్నారు. కాదంటే షోకాజ్‌ నోటీసులిచ్చి సిఐలు, ఎస్‌ఐలు బెదిరిస్తున్నారు. ప్రతిరోజూ మండలంలోని ఇద్దరు మహిళా పోలీసులకు పోలీస్‌ స్టేషన్‌లో విధులు వేస్తున్నారు. మరోపక్క తమకు చెప్పకుండా ఎలా వెళ్తారంటూ పంచాయతీ కార్యదర్శుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరితే సిఐలు, ఎస్‌ఐలు ఇవ్వడం లేదు. ప్రస్తుతం మహిళా పోలీసులకు సచివాలయ పరిధిలో ఐదు సంవత్సరాల్లోపు పిల్లల జాబితా తయారీ, మిషన్‌ వాత్స్యల్య విధులు, ఎస్‌డిజి సర్వే వంటివన్నీ అప్పగించారు. అవన్నీ కాకుండా ఎస్‌ఐలు, సిఐలు అదనపు విధులు కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. 50 కిలోమీటర్ల దూరంలో సిఎం పర్యటన బందోబస్తుకు, ఉద్యోగ రాత పరీక్షా కేంద్రాల విధులకు కూడా మహిళా పోలీసులను వినియోగిస్తున్నారు. అర్ధరాత్రి వరకూ డ్యూటీ చేసి ఉదయం సచివాలయానికి ఆలస్యంగా వస్తే పంచాయతీ కార్యదర్శి ఊరుకోవడం లేదు. దీంతో తమ జాబ్‌చార్ట్‌ ఏమిటంటూ మహిళా పోలీసులు మదనపడుతున్నారు. ప్రశ్నిస్తే సిఐలు, ఎస్‌ఐలు మరింత దారుణంగా కక్ష సాధింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ సమస్యలు జిల్లా ఉన్నతాధికారులకు చెప్పాలన్నా మహిళా పోలీసులు భయపడుతున్నారు. మహిళా పోలీసుల జాబ్‌చార్ట్‌పై ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు స్పష్టత ఇవ్వకపోతే అధికారుల వేధింపులు రోజురోజుకీ మరింత పెరిగే ప్రమాదం ఉంది.
కోవర్టులను పెట్టి కక్షసాధింపు
'విభజించు పాలించు' అనే బ్రిటీష్‌ వారి సూత్రాన్ని పలుచోట్ల సిఐలు, ఎస్‌ఐలు మహిళా పోలీసుల విషయంలో అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ మాటవింటూ అనుకూలంగా ఉన్న మహిళా పోలీసులతో మిగిలిన వారి సమాచారాన్ని, వాళ్లు మాట్లాడుకునే మాటలను తెలుసుకుని కక్ష సాధింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. తమకు కోవర్టులుగా పని చేస్తున్న ఉద్యోగులకు విధుల కేటాయింపుల్లో వెసులుబాటు ఇస్తున్నట్లు సమాచారం.