ప్రజాశక్తి -కంచరపాలెం : మహిళల మేథాశక్తి సమాజానికి ఉపయోగపడాలని ఐద్వా జిల్లా అధ్యక్షులు బి. పద్మ పిలుపునిచ్చారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో నెల్లూరులో ఐద్వా 15వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం ఐద్వా కంచరపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో కంచరపాలెం కార్యాలయం వద్ద ఐద్వా పతాకాన్ని సీనియర్ నేత ఎం. జయలక్ష్మి ఆవిష్కరించారు. సంఘసంస్కర్త గురజాడ అప్పారావు 160వ జయంతి నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి ఐద్వా సీనియర్ నాయకులుభాగ్యలక్ష్మి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం కె. అనురాధ అధ్యక్షతన నిర్వహించిన సభలో బి. పద్మ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం -సమానత్వం - స్త్రీవిముక్తి నినాదాలతో 1936లో ఆవిర్భవించిన ఐద్వా పితృస్వామ్య భావజాల ఆధిపత్యాన్ని అంతమొందించేందుకు కృషి చేస్తోందన్నారు. చరిత్రను ఆధునిక మహిళ తిరగరాయనుందన్నారు. బాల్య వివాహాలు, కన్యాశుల్కానికి వ్యతిరేకంగా సంఘ సంస్కరణ గురజాడ అప్పారావు ఉద్యమించారని, మహిళలను మేల్కొలిపే రచనలను చేశారన్నారు. గురజాడ దేశభక్తి గీతం నేటికీ సజీవంగానే ఉందని దాన్ని అందరూ ఆచరించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జోన్ కార్యదర్శి ఆ. పుష్పంజలి సాహు, ఐద్వా జిల్లా నాయకులు బొట్టా. ఈశ్వరమ్మ, జోన్ నాయకులు ఒ.విజయ, సిహెచ్.కమల, రూ. కుమారి, సిహెచ్.సుమిత్ర, ఆర్.భవాని, సులోచన పాల్గొన్నారు.










