మదనపల్లె అర్బన్ : ప్రవేట్ కళాశాల మహిళా లెక్చలర్ రుక్సానా (32) హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె హత్యకు భర్త ఖదీర్ అహమ్మద్ సహకరించినట్లు పోలీసులు విచారణలో తెలింది. ఈ హత్య కేసులో మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డిఎస్‌పి కేశప్ప తెలిపారు. సోమవారం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్‌పి మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలోని శివాజీ నగర్‌కు చెందిన రుక్సానా హత్య కేసులో భర్త ఖదీర్‌అహమ్మద్, బావజాన్ కుమారుడు ఎస్.ఆయాజ్‌అహమ్మద్, లేట్ బాషాసాహెబ్ కుమారుడు షేక్ జాఫర్‌బాషా, షేక్‌అలీఉల్లా కుమారుడు దాదపీర్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరు రుక్సానాను హత్య చేయడానికి బయట నుంచి సహాయం చేసినట్లు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే మహిళను హత్య చేయడానికి ప్రోత్సహించారని తెలిపారు. ఈ హత్య కేసులో ఇప్పటి కి మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిపై రౌడీ షీట్ ఓపెన్ చేశామని తెలిపారు. సమావేశంలో టూ టౌన్ సిఐ మురళీ కష్ణ పాల్గొన్నారు.










