Aug 18,2023 22:08

సర్టిఫికేట్‌ను అందుకుంటున్న ప్రిన్సిపల్‌ డా.సూర్యచంద్రరావు తదితరులు

* ఐఎస్‌ఒ 21001 సర్టిఫికేట్‌ అందజేత
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అరుదైన ఘనత దక్కించుకుంది. ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లోని తొలిసారిగా కళాశాలకు ప్రతిష్టాత్మక ఐఎస్‌ఒ 21001 సర్టిఫికేట్‌ పొందింది. ఐఎస్‌ఒ చైర్మన్‌ ఎ.శివయ్య కళాశాలను శుక్రవారం సందర్శించి ప్రిన్సిపాల్‌ కె.సూర్యచంద్రరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సర్టిఫికేట్‌ ఆధారంగానే ప్రభుత్వం కళాశాలల నాణ్యత, ప్రమాణాలు తెలుస్తాయని చెప్పారు. నాక్‌ (ఎన్‌ఎఎసి) బృందం సందర్శించి గ్రేడ్‌ ఇచ్చే సందర్భంలో ఇది ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. వీటితోపాటు ఐఎస్‌ఒ 14001 సర్టిఫికేట్‌, 2015 ఎన్విరాన్‌మెంటల్‌ స్టాండర్డ్స్‌, 2018 ఎనర్జీ స్టాండర్డ్స్‌కు సంబంధించి ఐఎస్‌ఒ 50001 సర్టిఫికేట్లనూ ఆయన అందించారు. రెన్యువల్‌ సందర్శనలో భాగంగా కళాశాలలోని అన్ని శాఖలను, లేబొరేటరీలను పరిశీలించారు. గ్రీన్‌ హవెస్టింగ్‌, రిజల్ట్‌ ఎనాలసిస్‌, ఆడిట్‌, ఐక్యుఎసి నివేదికలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కళాశాలలో అన్నిరకాల అంశాల్లో పనితీరు ప్రశంసనీయంగా ఉందని కితాబునిచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సురేఖ, నరసన్నపేట ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ లత, టెక్కలి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌ గోవిందమ్మ, పాతపట్నం కళాశాల ప్రిన్సిపల్‌ కె.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.