ప్రజాశక్తి-ఏలేశ్వరం ఏజెన్సీ ముఖ ద్వారమైన ఏలేశ్వరంలో మహిళ డిగ్రీ, జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి స్త్రీ విద్యను ప్రోత్సహించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరహాలు, ఎం గంగా సూరిబాబు డిమాండ్ చేశారు. ఈ నెల 8 నుండి 14 వరకు జరిగే ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్ ర్యాలీలో భాగంగా ఆదివారం ర్యాలీ ఏలేశ్వరం చేరుకుంది. స్థానిక బాలయోగి గురుకుల పాఠశాలలో వారు విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీలోని ఐదు మండలాల ప్రజలు విద్య నిమిత్తం ఏలేశ్వరం రావాల్సి ఉందన్నారు. మహిళలకు ప్రత్యేకంగా జూనియర్ డిగ్రీ కళాశాల లేకపోవడంతో తల్లిదండ్రులు పిల్లలను డిగ్రీ విద్యకు దూరం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు ఇంటర్ పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదని, ప్రభుత్వం అందిస్తున్న మెస్ ఛార్జీలు చాలీచాలకుండా ఉన్నాయని, జిఒ 77 వల్ల పిజి విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ అందక చదువు మానుకోవాల్సి వస్తోందన్నారు. జిఒ 107, 108 ద్వారా వైద్య విద్యను ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ అధ్యాపక ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ యాత్రలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు మణికంఠ, సాహితి, గోపాల్, రాజేష్, సంజరు, శివ, పవన్, రోహిత్, వాసు, నాని తదితరులు ఉన్నారు.










