Mar 23,2022 06:53

    ర్ర పూల వనంలోని మరో పువ్వు రాలింది. ఆ పువ్వే మల్లు స్వరాజ్యం. తెరిచిన పుస్తకం వంటి ఆమె జీవితం ప్రతి మహిళకు ఒక పాఠ్యాంశం. ప్రజా జీవితంలోకి అడుగు పెట్టిన ప్రతి మహిళకు ఆమె జీవితం ఒక పాఠశాల. 92 సంవత్సరాల నిండు జీవితం ఆమెది. 80 సంవత్సరాల ప్రజా జీవితం ఆమెకు ఎనలేని అనుభవాలను ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు తరాల ప్రజలను, ప్రత్యేకించి స్త్రీలను అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి మరొకరు ఉన్నారా అనిపిస్తుంది. దేశ స్వాతంత్రోద్యమంలోనూ, దేశ చరిత్రను మలుపు తిప్పిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ను, మహిళా ఉద్యమాల్లోనూ పాల్గొన్న వారు, నాయకత్వం వహించిన అనేకమంది స్త్రీలు లేకపోలేదు. కానీ తుది శ్వాస వరకు ఉద్యమాలలో కొనసాగినవారు బహు అరుదు.
    ఒక కళాకారిణి. ఒక విప్లవకారిణి. ఒక ప్రజాప్రతినిధి. ఒక మహిళా హక్కుల నేత. ఒక మాతమూర్తి.. ఇలా ఆమెలో ఎన్ని పాత్రలో. ఆమె జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు. అవి రాజకీయమైనా, వ్యక్తిగతమైనా. అన్నిటినీ తట్టుకుని నిలిచిన ధీశాలి.
 

                                                                      చిన్న నాటి నుండి ....

11-12 సంవత్సరాల వయస్సులో ప్రారంభమైన స్వరాజ్యం ప్రజా జీవన ప్రస్థానంలో ఎన్నో ఘట్టాలున్నాయి. అతి చిన్న వయసులో వ్యవసాయ కార్మికులను, ప్రత్యేకించి స్త్రీలను ప్రోత్సహించి సమ్మె చేయించింది. ఫ్యూడల్‌ దొరల పెత్తనం కింద నలిగిపోయిన ఆనాటి తెలంగాణలో వ్యవసాయ కార్మిక స్త్రీల స్థితి కడు దయనీయం. పచ్చి బాలింత అయినా రోజుల పసికందుని వదిలి దొరల పొలాల్లో పనికి వెళ్లక తప్పేది కాదు. 'పాలు చేపుకు వచ్చినాయి దొరా.. చంటి బిడ్డకు పాలిచ్చి వస్తాను' అని అన్నా వదలకుండా, ఏది చూపించు, అని చనుబాలు పిండించిన పైశాచికానందం నాటి దొరలది.
    ఆమెకు యుక్తవయసు వచ్చేనాటికి రగులుతున్న తెలంగాణ దొరల పెత్తనానికి వ్యతిరేకంగా తిరగబడింది. పోరాట కాలంలోనూ, విరమణ తరువాత కూడ ఏడు సంవత్సరాల పాటు పూర్తిగా జనంలోనే సంచరించింది. ఇంటి ముఖం చూడలేదు. 16 సంవత్సరాల వయసు నుంచి సుమారు 23 సంవత్సరాల వయస్సు వరకు నల్గొండ, వరంగల్‌, ఇప్పటి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో ప్రజల్లో విస్తత ప్రచారం చేసి ఉద్యమాన్ని విస్తరింపజేసింది. అటవీ ప్రాంతమే ఆమె నివాస ప్రాంతం. ఆమే దళ కమాండర్‌. ఆమె తోటి దళసభ్యుల్లో ఒకరు కామ్రేడ్‌ మల్లు వెంకట నరసింహారెడ్డి. పోరాట విరమణ అనంతరం ఆయన ఆమె జీవిత భాగస్వామి అయ్యారు.
     స్వరాజ్యం జీవితం గురించి చెప్పుకుంటూపోతే ఎన్నో జ్ఞాపకాలు. ఆమె కుటుంబ జీవిత ప్రారంభ దినాలు మదర్‌ ఇండియా సినిమాలో నర్గీస్‌ను తలపిస్తాయి. కామ్రేడ్‌ విఎన్‌ ఉద్యమ బాధ్యతలు ఒక తపస్సులా నిర్వహిస్తే, కుటుంబ బాధ్యతను తాను భుజాన వేసుకుని రైతు మహిళగా పొలం దున్ని, సాగుచేసి పిల్లల్ని సాకింది. అయినా ఇంటి బాధ్యతల్లో కూరుకుపోయి రాజకీయాలు మరువలేదు. ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడికి ఉరుకుతూ, ప్రజల్ని ఉత్సాహపరుస్తూ ప్రజా ఉద్యమాలను కాపాడుకుంటూ సాగించింది జీవనయానం.
 

                                                                         ప్రజా ప్రతినిధిగా...

    సాయుధ పోరాటానికి ముందు, పోరాట సమయంలోనూ, తదనంతరం శాంతి కాలంలోనూ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మహిళా సమస్యలను విడవలేదు. పైపెచ్చు ఫ్యూడల్‌ భూస్వామ్య దోపిడీకి, స్త్రీ అణచివేతకు ఉన్న సంబంధాన్ని ప్రతి సందర్భంలోనూ ఎత్తిచూపే వారు. స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం చిన్ననాటి నుండి చెప్పడమేగాక చేసి చూపారు. ఆ కాలంలో ఆడపిల్లలకు బాల్యంలోనే వివాహాలు చేసి అత్తగారింటికి ఈడ్చుకు పోతుంటే పిల్లల గుంపును పోగుచేసి అడ్డుకున్న ఘటనలను ఆమె చెబుతూ ఉండేవారు.
     పోరాట కాలంలో స్త్రీలకు కూడా ఆయుధ శిక్షణ ఇప్పించాలని పట్టుబట్టడం, దళ సభ్యురాలిగా ఉన్న కోయ మహిళ నాగమ్మ లో నాయకత్వ లక్షణాలను గుర్తించి ప్రోత్సహించడం, దాంపత్య జీవితంలో స్త్రీల ఇష్టానికి విలువ ఇవ్వాలని, ఇష్టం లేని పెళ్లి నుండి బయట పడే హక్కు స్త్రీలకు ఉండాలని, ఆస్తి పంపకాల లో స్త్రీలకు కూడా వాటా అవసరమని పట్టుబట్టడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో...
     శాసనసభను వేదికగా చేసుకొని ఎన్నో సమస్యలపై గళమెత్తారు. శాసనసభలో ఉన్న మగవాళ్ళు రాజఠీవి ఒలకబోస్తూ మాట్లాడటం మనకి తెలిసిందే .స్త్రీల మరుగుదొడ్లు సమస్యలు,మంచి నీటి సమస్యలు, ప్రసూతి సౌకర్యాల గురించి ఎవరూ మాట్లాడరు. ''మరుగుదొడ్ల స్వరాజ్యం'' అని నిందలు పడడానికి వెరవలేదు. ఆడవాళ్ళ దైనందిన, దాంపత్య, లైంగిక జీవిత సమస్యలు లేవనెత్తినా ప్రతి ఒక్కరు నిందలు మోసినవారే. రమీజాబి ఘటనపై ఆమె స్పందించిన తీరు అత్యున్నత చైతన్యానికి నిదర్శనం.
     ఆమె ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే హైదరాబాదులో పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రమీజాబిపై పోలీసుల అత్యాచార ఘటనపై పెద్ద ఉద్యమం సాగింది. బాధితుల్ని అపఖ్యాతి పాలుచేయడం ద్వారా చేసిన నేరాల నుండి తప్పించుకునే సంస్కతి మన సమాజంలో బాగా వేళ్లూనుకుని పోయింది. ''రమీజాబి మంచిది కాదు అంట కదా'' అనే ప్రచారం ఊపందుకుంది. కొందరు ఆ హౌరులో కొట్టుకుపోయారు కూడా. ఆమె వెరవలేదు. ఒక ఎమ్మెల్యేగా ఉద్యమంలోకి ఉరికింది. అదీ ఆమె తెగువ, చిత్తశుద్ధి.
    తెలంగాణ యాసలో ఆమె ఉపన్యాసాలు మనసుని తాకేవి. కార్యకర్తల్ని తయారు చేయాలన్న నిర్మాణ కర్తవ్యాన్ని 'లొట్టలు కట్టి బావిలో పడేయండి' అంటూ పిల్లలకి ఈత నేర్పిన పద్ధతిని చెప్పేవారు.
     సాయుధ పోరాట కాలంలో దళ నాయకురాలిగా పనిచేసిన అనుభవం ఆమె ప్రతి మాటలోనూ, చేతల్లోనూ కనిపించేది. మీనమేషాలు లెక్క పెట్టేది కాదు. నాన్చుడు లేదు. తప్పుగాని ఒప్పుగాని సునాయాసంగా నిర్ణయాలు చేసేది.
    ఆమె జనారణ్యంలో గెరిల్లా. ఒక రైతు బ్యాంకుకు అప్పు పడ్డాడు. బ్యాంకు ఆయన బండిని ఎడ్లతో సహా జప్తు చేసి పోలీస్‌ స్టేషన్‌లో పెట్టారు. రైతు వచ్చి ఎమ్మెల్యేగా ఉన్న స్వరాజ్యం దగ్గర మొత్తుకున్నాడు. పోలీస్టేషన్‌కు పోయి ఘర్షణపడ్డాది. పోలీస్‌ డిపార్ట్మెంట్‌ వినదు కదా. 'చట్టం తన పని తాను చేస్తుంది' అని ముక్తాయిస్తుంది. 'మంచిది. ప్రజా నాయకురాలిగా నా పని నేను చేస్తున్న నీ ఇష్టం వచ్చింది చేసుకో' అని ఎడ్ల తో సహా బండిని రైతుకు అప్పగించింది. ఇదీ స్వరాజ్యం గెరిల్లా తత్వం. ఇటువంటి అనుభవాలు ఎన్నో. కష్టమైనా, క్లిష్టమైనా, కఠోర నిర్ణయాలు అమలు చేసి చరిత్రను మలుపు తిప్పిన వీరవనితలు ఎందరో ఉన్నారు ఈ దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో కూడా. ఆ కోవలోనిదే స్వరాజ్యం.
 

                                                                    జనంతో మమేకం....

ఆమె గురించి చెప్పవలసిన మరో ముఖ్య విషయం ఏమంటే, ఆమె ఆంధ్ర- తెలంగాణ వారధి. తెలుగు భాష మాట్లాడే వారే అయినా జీవనవిధానంలో, పలికే భాషలో కొంత వైవిధ్యం కనిపిస్తుంది. తెలంగాణ ప్రత్యక్షంగా నైజాం పాలన లో ఉంటే, ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్‌ స్వాధీనంలో ఉంది. ఇరు ప్రాంతాల ప్రజలు ఒకరికొకరు చేరువ కావడానికి, అర్థం కావడానికి ఆమె ఉపన్యాసం, నాయకత్వం పని చేసింది. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆంధ్ర ప్రాంతం దన్నుగా నిలిచింది. పోరాట యోధుల్ని కడుపులో పెట్టుకొని కాపాడింది. ఆంధ్ర కమ్యూనిస్టు నాయకత్వం ప్రోత్సాహంతో చిన్నవయసులో స్వరాజ్యం ఆంధ్ర ప్రాంత జిల్లాల్లో విస్తతంగా పర్యటించినపుడు నిధులు సమీకరించి రూపాయల దండలు వేశారట. అంతెందుకు సుబ్బారెడ్డి స్టేడియంలో ఆమె ఉపన్యాసం ఇటీవలి చరిత్ర. 1992- 93 కాలంలో మద్య వ్యతిరేక ఉద్యమానికి నాంది నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రభుత్వం తలపెట్టిన సారా పాటలు వేలం అడ్డుకోవడానికి వేలాది మందితో జరిగిన ప్రదర్శన. స్త్రీలు ట్రాక్టర్లు నడుపుతూ వచ్చారు. బహిరంగ సభలో స్వరాజ్యం ఉపన్యాసం ఉర్రూతలూగించింది. కర్తవ్యం బోధించింది. ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది.
    స్త్రీలకు ఆస్తి హక్కు నిత్యం ఆమె నోట్లో నానుతూ ఉండే సమస్యల్లో ఒకటి. వారసత్వ ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్ళకు కూడా వాటా కావాలన్నది మహిళా ఉద్యమం యొక్క చిరకాల లక్ష్యం. ఎన్టీ రామారావు హిందూ వారసత్వ చట్టానికి మార్పులు తెచ్చే క్రమంలో అసెంబ్లీ ఒక కమిటీని నియమించింది .ఆ కమిటీ సభ్యురాలిగా ఆమె రాష్ట్రమంతటా పర్యటించి వారసత్వ ఆస్తి తోపాటు భర్త ఆస్తిలో కూడా వాటా కావాలనే మహిళా సంఘం డిమాండును ప్రజల ముందుకు తెచ్చారు.
    ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘం సారథ్యంలో 1985లో హైదరాబాదులో అసెంబ్లీ ఎదుట వేలాది మందితో సభ జరిగింది. ఆ సభలో వేలాది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు ఇచ్చాం. స్త్రీలకు మరుగుదొడ్లు, గర్భిణులకు అలవెన్సులు మొదలుకొని ఆడ పిల్లలకు ప్రత్యేక పాలిటెక్నిక్‌లు, కాలేజీలో కరాటే శిక్షణ వంటి అనేక డిమాండ్‌ల రూపకల్పనలో ఆమె భాగస్వామి అయ్యారు.
    ఆమె సారథ్యంలో 1980లో సూర్యాపేటలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘం రాష్ట్ర మహాసభలో అధ్యక్షురాలిగా ఉదయం గారు, కార్యదర్శిగా స్వరాజ్యం ఎన్నికయ్యారు.
    1984లో మరల మిర్యాలగూడలో మహాసభ జరిగింది. ఆ సభలోనే మరో తెలంగాణ పోరాట యోధురాలు ఐలమ్మను సన్మానించాం. మహిళా ఉద్యమ పునర్నిర్మాణంలో కామ్రేడ్స్‌ మానికొండ సూర్యావతి, మోటూరు ఉదయం గార్లతో కలిసి వివిధ జిల్లాల్లో పర్యటించారు.
 

                                                                 నిరంతర కర్తవ్యదీక్ష ....

స్వరాజ్యంలో ఉన్న విశేషం ఏమంటే.. ఆమె పుట్టింది భూస్వామి కుటుంబంలో. అయినా వ్యవసాయ కార్మిక, రైతు కుటుంబాలు ఆమెను ప్రేమిస్తాయి. భూమికోసం భుక్తి కోసం సాగిన పోరాటానికి ప్రతినిధిగా ఆమెను భావిస్తారు. ఆమె పుట్టిన కులానికి ప్రతినిధిగా ఆమెను ఎవరూ చూడరు. దళితులతో సహా సబ్బండ వర్ణాలు ఆమెను ప్రేమిస్తారు. వెట్టిచాకిరికి, కుల పీడనకు వ్యతిరేకంగా సాగిన పోరాటానికి ఆమెను ప్రతినిధిగా చూడటమే ఇందుకు కారణం. పై కులాల స్త్రీలతో సహా అందరు స్త్రీలు, స్త్రీల సంఘాల నేతలు ఆమెను అభిమానిస్తారు. సాధారణ స్త్రీల గళాన్ని ఆమె గొంతులో వినిపించడమే ఇందుకు కారణం కావచ్చు. బుద్ధిజీవులు కూడా ఆమెలో ఒక మేధావిని చూస్తారు. చదివింది మూడు నాలుగు తరగతులే. కానీ మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనే విశ్వవిద్యాలయం ఆమెకు అనేక పాఠాలు నేర్పింది. పోరాటం అనంతరం రైతు స్త్రీ జీవితం, పిల్లల్ని సాకుతూ, మట్టిలో దిగబడి సేద్యం చేసిన వ్యవసాయదారు జీవితం, స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత సమాజంలో వచ్చిన మార్పులు అన్నీ కలిసి ఆమెకు పీహెచ్‌డీ పట్టా ఇప్పించాయా అనిపిస్తుంది. ఆమెతో కలిసి పదేళ్లపాటు పని చేశాను. నేను, ఆమె అధ్యక్ష కార్యదర్శులుగా, అఖిలభారత కమిటీ ప్రతినిధులుగా కలిసి కృషి చేశాం. ఆప్యాయతలు పంచుకున్నాం. ఆలోచనలూ పంచుకున్నాం. తగాదాలు కూడా పడ్డాం. ఇప్పుడు ఆమె మనల్ని వదిలి పోయిందని ఏడవడం కాదు చేయాల్సింది. ఏడవడం ఆమెకు నచ్చని పని. కర్తవ్యోన్ముఖులను చేయడమే ఆమెకు ఇష్టం. సూర్యావతి గారు చనిపోయినప్పుడు ఇదే స్థితి ఎదురైంది. 'ఏడుస్తూ కూర్చోకపోతే అనుభవాలు రాద్దాం' అన్న ఆమె ఆదేశంతోనే 'మహిళా ఉద్యమ మణిపూస మానికొండ సూర్యావతి' పుస్తకం వెలువడింది. మనం చరిత్రను సృష్టించాలి అని తరచూ అంటుడేవారు. 80 సంవత్సరాల ఉద్యమ జీవితం ఆమె చరిత్రను లిఖించింది.
 

సిపిఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు

ఎస్‌.పుణ్యవతి