Mar 06,2023 23:51

మహిళా దినోత్సవంలో పాల్గొన్న పలు కంపెనీల మహిళలు

ప్రజాశక్తి - పరవాడ
రాంకీ ఫౌండేషన్‌ ఆధ్వర్యాన ఫార్మాసిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోమవారం ఫార్మాసిటీ హబ్‌లో ప్రారంభించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి రాంకీ ఫౌండేషన్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం వివిధ ప్రభుత్వ, ఇతర ఫార్మా కంపెనీల్లో అత్యంత ప్రతిభను కనపర్చిన మహిళలకు రాంకీ మహిళా సాధికారత పురస్కారాన్ని అందచేశారు. ఈ సందర్భంగా విశాఖ ఫార్మాసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పిపి లాల్‌ కృష్ణ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందినట్లు, ఫార్మా రంగంలో కూడా ఎంతగానో అభివృద్ధి చెందారని తెలిపారు. విశాఖ ఫార్మా సిటీలో సుమారు 9000 నుండి 10వేల మంది వరకు మహిళలు పనిచేస్తున్నట్లు చెప్పారు. సెంటర్‌ ఫర్‌ మహిళా స్టడీస్‌ డైరెక్టర్‌ ఉషా మాట్లాడుతూ మహిళలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నా వారిపై వేధింపులు కూడా అధికంగా జరుగు తున్నాయని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో సైబర్‌ వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, వీటిపట్ల మహిళ లందరూ జాగ్రత్తగా మెలగాలని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. జెనీత్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వింధ్య మాట్లాడుతూ మహిళలు ఇప్పటికే అన్ని రంగాలలో ప్రతిభను కనబర్చినా ఇంకా ఎంతో సాధించవలసి ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాంకీ ఫౌండేషన్‌ డిప్యూటీ హెడ్‌ కె.శ్రీకాంత్‌ శ్రీనివాస్‌, మ్యాక్స్‌ అధ్యక్షురాలు రాజేశ్వరి, పలు ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.