Jun 15,2023 01:30
ఎమ్మెల్యే రఘుపతికి వినతిపత్రం అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల పట్టణంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కార్యదర్శి ఆర్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోన రఘుపతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్య మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన బాపట్లలో ఉన్న ఏకైక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలో వివిధ గ్రామాల నుంచి పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకోడానికి ఆసరాగా ఉందన్నారు. యేడేళ్లకు పూర్వం బాపట్లకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వచ్చినప్పటికీ కళాశాల పక్కా భవనం నిర్మాణానికి నోచుకోలేదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఈ కళాశాల అభివృద్ధిపై శ్రద్ధ కనబరచకపోవడంతో మహిళలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. నేడు డిగ్రీ విధానంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా కళాశాల అస్తవ్యస్తంగా తయారైందన్నారు. 2023- 24 విద్యా సంవత్సరం నుంచి నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా డిగ్రీలో మేజర్‌ సబ్జెక్టు మైనర్‌ సబ్జెక్టు అనే కొత్త పద్ధతిని ప్రవేశ పెట్టారన్నారు. ఈ విధానంలో ప్రతి గ్రూపునకు మూడు తరగతి గదుల అవసరమవుతున్నారు. ఇప్పటికే డిగ్రీ కళాశాలలో విద్యార్థులు నిష్పత్తికి తగ్గట్టు తరగతి గదులు లేక ఉదయం మధ్యాహ్నం అంటూ రెండు షిఫ్ట్‌లు గా కళాశాల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కళాశాలలో బోధిస్తున్న బిఏ, బీకాం, బీఎస్సీ, గ్రూపులో నుంచి మేజర్‌, మైనర్‌ గ్రూపులను ఎంచుకొని సైన్స్‌ లోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన బిజెడ్‌సి గ్రూపునకు తరగతి గదులు లేవనే కారణంతో తీసివేయడం సరికాదన్నారు. ఇంటర్లో బైపిసి చదివి ఉన్నత విద్యలో బిజెడ్‌సి గ్రూప్‌ను అభ్యసించాలనే విద్యార్థులకు ఈ విధానం శాపంగా మారిందని అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి కళాశాలలో అందుకు తగిన ఏర్పాట్లు చేసి బీజెడ్‌సి గ్రూప్‌ను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ యేడాది ఈ గ్రూపు తీసివేస్తే వచ్చే యేడు నుంచి ఈ గ్రూపుతో పాటు బోటనీ సబ్జెక్టు పోస్ట్‌ కూడా ఉండదని, క్రమంగా కళాశాలలో సంఖ్య తగ్గిందనే కారణంతో పూర్తిగా కళాశాల మూతపడే అవకాశం ఉందని అన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే ప్రభుత్వ కళాశాలలను మూసివేసే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి కళాశాలలో అన్ని గ్రూపులను కొనసాగించే విధంగా తరగతి గదులను ఏర్పాటు చేయాలని ఆర్య కోరారు. బిజెడ్‌సి గ్రూపును కొనసాగించే విధంగా కషి చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వమే స్థలం కేటాయించి కళాశాలకు పక్కా భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. పేద మహిళా విద్యార్థులకు ఉన్నత విద్యకు దూరం చేస్తే ఎస్‌ఎఫ్‌ఐ పోరాటం చేస్తుందన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహిళ కన్వీనర్‌ నాగలక్ష్మి, కళాశాల విద్యార్థులు స్నేహ జ్యోతి, రమ్య పాల్గొన్నారు.