Jul 29,2023 20:40

రాయచోటి బహిరంగసభలో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి

- హింసపై మహిళల పోరుయాత్రలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి
ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌: దేశంలో రాష్ట్రంలో మహిళలపై దాడులు, మానభంగాలు, హత్యలు రోజురోజుకు తీవ్రమవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణ చట్టాలను పటిష్టంగా అమలుచేయడంలో నిర్లక్ష్యమే కారణమని ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం ఐద్వా ఆధ్వర్యంలో మహిళల పోరుయాత్ర రాష్ట్ర జాతా శనివారం పుట్టపర్తి జిల్లా కదిరి నుంచి అన్నమయ్య జిల్లాకు చేరుకుంది. గాలివీడు, రాయచోటి, చిన్నమండెం, కురబలకోట మీదుగా మదనపల్లె వరకూ సాగింది. రాయచోటి కెజిబిఎస్‌ మోడల్‌ స్కూల్‌, బస్టాండ్‌ సర్కిల్‌లో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజలు జాతాను ప్రారంభించారు. మొదట మహిళల మీద జరుగుతున్న ఆకృత్యాలు ఉట్టిపడేలా ప్రజానాట్య మండలి బృందం ప్రదర్శించబడిన ఆట, పాట నృత్యాలు ప్రజానీకాన్ని ఆకట్టుకుంటూ ఆలోజింపచేశాయి. జాతా ప్రధాన వ్యక్త ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి మాట్లాడుతూ దేశ ప్రతిష్ట పెంచిన మహిళా రెజ్లర్లు గోల్డ్‌ మెడల్‌ తెస్తే వారిపై లైంగిక వేధింపులు, మణిపూర్‌లో హింసాకాండ, యూనివర్శిటీలలో లైంగిక వేధింపులకు ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినులు ఎంతో మంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ చిన్నారులపై మహిళలపై హింస రోజు రోజుకి విపరీతంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరిగించి అత్యాచారం చేసి హత్యలు చేస్తున్నప్పటికి ప్రదాని మోడీకి చలనం లేదన్నారు. చివరకు సుప్రీం కోర్టు స్పందించే వరకు కేసులు నమోదు చేయలేదన్నారు. కేసులు అయితే నమోదు చేసి ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. రోజుకు వందల సంఖ్యలో మహిళలు అదృశ్యమైన కేసులు వెలుగు చూస్తున్నా దిశ, నిర్భయ లాంటి చట్టాలు పేరుకేనని అమలులో నిరక్ష్యం ప్రభుత్వాలు వీడాలని సూచించారు. రిజర్వేషన్ల అమలులలో జాప్యం వీడాలన్నారు. 3200 మంది మహిళలు అదృశ్యమైతే ప్రభుత్వాలు నోరుమెదపలేదని పేర్కొన్నారు. 190 మంది అత్యాకారాలకు గురయ్యారన్నారు. మహిళలు ఐక్యంగా సమస్యల పట్ల ఉద్యమించాలన్నారు. మత్తు, మద్యం వల్లే నిత్యం మహిళలు హింసకు, దాడులకు గురి అవుతున్నారని వీటిని సంపూర్ణంగా నిషేధించాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్ర సమయంలో జగన్‌ మోహన్‌ రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పి నిషేధ చట్టాన్ని తీసుకురాక పోగా మత్తు పదార్థాలను విచ్చలవిడిగా దొరికే విధంగా చేశారని విమర్శించారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మతతత్వ బిజెపి ప్రభుత్వం దేశాన్ని, దేశ సంపదను, ఖనిజాలను ఆదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. అందుకోసమే ఆర్టికల్‌ 370 రద్దుచేసి కాశ్మీర్‌ భూములపై అదానీ, అంబానీల పెత్తనం చలాయించే విధంగా చేశారన్నారు. ఆగస్టు ఎనిమిదిన మహిళల సమస్యలపై విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా గౌరవ అధ్యక్షులు దిల్షాద్‌, రాష్ట్ర నాయకులు రామంజులమ్మ, ఐద్వా అన్నమయ్య జిల్లా కన్వీనర్‌ ఇ.భాగ్యమ్మ, బంగారుపాప, ఖాజాబి, రెడ్డెమ్మ, నిర్మల, మాధవి, కరుణ, లావణ్య, పద్మజ, ప్రజానాట్య మండలి కార్యదర్శి వెంకటాచలపతి, శ్రీరాములు, పలువురు పాల్గొన్నారు. జాతా మదనపల్లె నుంచి చిత్తూరు జిల్లా కుప్పంకు చేరుకుంది.