మహిళా బిల్లు ఆమోదం హర్షణీయం : వీసి ఆచార్య డి భారతి
ప్రజాశక్తి - క్యాంపస్ : దేశ చరిత్రలో పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదించడం 2023వ సంవ త్సరం చరిత్రలో లిఖించదగిందని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి భారతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపే అభినందన సభను పరిపాలన భవనం ఎదుట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించడంపై శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం హర్షం వ్యక్త పరిచిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ భారతి మాట్లాడుతూ నిజంగా సెప్టెంబర్ 19 మహిళా సమాజానికి ఒక చారిత్రాత్మక దినమని, చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు ఆమోదం వల్ల లోక్ సభ, రాష్ట్రాల శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్లు అమలు అవుతాయన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరుగుతుందన్నారు. దేశాభివద్ధిలో మహిళల పాత్ర కీలకమని, రాజకీయాలలో మహిళల ప్రాతి నిథ్యం, స్వయం నిర్ణయాధికారం పెరిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యపడుతుందని, లింగ అంతరాన్ని రూపు మాపవచ్చన్నారు.ఈ కార్యక్రమానికి సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ అనురాధ స్వాగతం పలకగా, సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ సుజాత, ఐక్యుఏసి డైరెక్టర్ ప్రొఫెసర్ త్రిపుర సుందరి, లైబ్రరీ డీన్ ప్రొఫెసర్ వాణి, స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ కాత్యాయని, కన్సల్టెన్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ శారద, ప్రొఫెసర్ సీతా కుమారి, ప్రొఫెసర్ నిర్మల, ప్రొఫెసర్ మధ్య జ్యోతి, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










