ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
మహిళా ఆర్థిక అభివృద్ధి కోసం గ్రామీణాభివృద్ధి సంస్థ పనిచేస్తోంది. ఇందు కోసం మహిళలను స్వయం సహాయ సంఘాలుగా ఏర్పాటు చేయడం ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు అవసరమైన రుణాలను అందించడంతో పాటు స్వయం శక్తితో ఎదిగేలా వృత్తి విద్యాశిక్షణ అందించడం అవసరమైన ముడిసరుకుల కొనుగోలు కోసం బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్వయం సహాయక సంఘాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నడుస్తున్నారు. జిల్లా సమాఖ్య ప్రతినెలా సమావేశం నిర్వహించి సమీక్ష చేస్తోంది. మండల పరిధిలో సమాఖ్య భవనాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. జగనన్న షాపింగ్ మాల్స్ ద్వారా స్వయం సహాయ సంఘాల్లోని సభ్యులు తయారు చేస్తున్న వస్తువులతో పాటు కార్పొరేట్ సంస్థల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. వీటిల్లో వస్తున్న లాభాలను తిరిగీ సంఘ సభ్యులకు అందజేయడం జరుగుతోంది. దేశ,రాష్ట్ర స్థాయిలో చిత్తూరు జిల్లా స్వయం సహాయ సంఘాల ప్రతిభ చాటుతున్నారు. నవోదయం పత్రిక అవార్డును సొంతం చేసుకుంది. ప్రభుత్వం మహిళా అభివృద్ధి కోసం అందిస్తున్న సంక్షేమ పధకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ తులసి కోరారు. ప్రజాశక్తి ప్రత్యేక ఇంటర్వ్యూలో గ్రామీణాభివృద్ధి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేశారు.
ప్రజాశక్తి : సామాజిక పెన్షన్స్ డిఆర్‌డిఎ ద్వారా అందిస్తున్నారు, అవి ఎన్ని రకాలు, ఏవి?
పిడి: వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక పేరుతో వృద్దాప్య, వితంతు, వికలాంగ, చేనేత, అభయహస్తం, కల్లుగీత, ఒంటరి మహిళ, హిజ్రాలు, మత్స్యకారులు, హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులు, డప్పుకళాకారులు, చర్మ కళాకారులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు, సైనిక వెల్పర్ ఫించన్లను అందించడం జరుగుతోంది. రూ.2,500 నుండీ రూ. 2,750ల వరకు పెంచడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో 54,1461 మంది పింఛన్ పొందుతున్నారు.
ప్రజాశక్తి : వైఎస్ చేయూత ఎంత మందికి అందిస్తున్నారు?
పిడి: 45 సంవత్సరాల నుండీ 60 సంవత్సరాలు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750లచోప్పున ఏడాదికి రూ.75వేలు మంజురు చేయడం జరుగుతోంది. స్వయం ఉపాధి అవకాశాలను పెంచుకోవడం కోసం ఈ పధకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. 2023 మూడో విడతలో 19,9459 మంది లబ్దిదార్లకు రూ.373.99 కోట్లు లబ్దిదార్ల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడం జరిగింది.
ప్రజాశక్తి: వైఎస్‌ఆర్ ఆసరా ద్వారా రుణమాఫి ఎంత ?
పిడి: వైఎస్‌ఆర్ ఆసరా పధకం ద్వారా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాన్ని మాఫీ 2019మే మాసం 17వ తేదీ నాటికి బ్యాంకులో ఉన్న నిల్వ 60.44 సంఘాల పొదుపు ఖాతాలకు నాలుగు విడతల్లో రూ. 2318.82 కోట్లు జమ చేయడం జరిగింది.
ప్రజాశక్తి : వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ ఎంత మంది సభ్యులకు అందజేశారు?
పిడి: నవరత్నాలు అమల్లో భాగంగా స్వయం సహాయక సంఘసభ్యులకు వైఎస్‌ఆర్ సున్నావడ్డీకి రుణాలు అందించేలా 2020 మే 24వ తేది ప్రారంభించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 62,556 స్వయం సహాయ సంఘాల రూ.155.22 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 67,391 స్వయం సహాయ సంఘాలకు రూ.124.20 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 68,440 స్వయం సహాయక సంఘాలకు రూ.134.05 కోట్లు సభ్యులు వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడం జరిగింది.










