Sep 08,2023 21:48

కేసు వివరాలను వెల్లడిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ

        పుట్టపర్తి రూరల్‌ : 2016లో జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేధించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితున్ని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాదవరెడ్డి శుక్రవారం నాడు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం పెమలకుంటపల్లి తండాకు చెందిన వడితే జీవిలీబాయి(45)కు ముదిగుబ్బ మండలం ముక్తాపురంతండాకు చెందిన బాబునాయక్‌తో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. ఆమె భర్త బాబునాయక్‌ అనారోగ్య కారణాలతో మరణించాడు. కుటుంబ పోషణకు జివిలీబాయి కేరళకు వెళ్లి అక్కడ కూలి పనులు చేసుకుంటూ గ్రామానికి వచ్చి పోతుండేది. ఈ క్రమంలో ముదిగుబ్బ మండలం సంకేపల్లి గ్రామంలోని మామిడి తోట దగ్గర ఉండే బుక్కపట్నం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన మంగలి రామచంద్ర ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం అతనితో సహజీవనానికి దారితీసింది. ఈ క్రమంలో జీవిలీబాయి 2016 ఆగస్టు 7వ తేదీ నుంచి కన్పించకుండా పోయింది. దీనిపై ఆమె తల్లి నల్లమాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నల్లమాడ పోలీసు స్టేషన్‌లో క్రైమ్‌ నెంబర్‌ 59/2016 కింద కేసు నమోదు అయ్యింది. గత ఏడు సంవత్సరాలుగా ఆమె కోసం విచారణ చేస్తున్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి ఛేదించే చర్యలు తీసుకున్నారు. సిఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. అనుమానితునిగా రామచంద్రను అదుపులోకి తీసుకుని విచారించారు. 2016 ఆగస్టు 7వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో కర్రతో కొట్టి ఆమెను చంపి, అక్కడే తోటలో పాతిపెట్టినట్లు నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితున్ని తోట వద్దకు తీసుకెళ్లి ముదిగుబ్బ తహశీల్దార్‌, కదిరి వైద్య సిబ్బంది సమక్షంలో జీవిలీబాయి ఎముకుల గూడును బయటకు తీశారు. అక్రమ సంబంధం, ఆర్థిక వివాదాల నేపథ్యంలోనే ఆమెను హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. నిందితున్ని రిమాండ్‌కు పంపి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు ఛేదింపులో కృషి చేసిన నల్లమాడ సిఐ రాజేంద్రనాథ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు, కానిస్టేబుల్‌ నరసింహులు, నరేష్‌లను ఎస్పీ అభినందించి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.