Nov 21,2023 21:48

మహిళ గౌరవం కోసం న్యాయపోరాటం
రోజా స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన మెజిస్ట్రేట్‌
ఎదుగుతున్న మహిళను అణగదొక్కే ప్రయత్నమే వ్యక్తిత్వ హననం
ఇలా చేసే ప్రతి ఒక్కరు శిక్షించబడాలి : మంత్రి ఆర్కే రోజా
ప్రజాశక్తి- నగరి:
మహిళ గౌరవం కోసం మంత్రి ఆర్కేరోజా న్యాయ పోరాటానికి నాంధి పలికారు. తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పిన మాటపై నిలబడుతూ తన వ్యక్తిత్వంపై నీచపు వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణ, టీవీ5 అసోసియేట్‌ ఎడిటర్‌ రాజేంద్రప్రసాద్‌, గాలి భానుప్రకాష్‌లపై మూడు సెక్షన్ల క్రింద కోర్టు నోటీసులను లాయర్‌ రవీంద్ర ద్వారా జారీ చేశారు. ఈ కేసుల నమోదు నిమిత్తం మంగళవారం జూనియర్‌ సివిల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు ఆమె హాజరుకాగా మెజిస్ట్రేట్‌ విష్ణువర్మ ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళంటే ఏదైనా అనవచ్చు అనుకునే మగవారికి బుద్దిచెప్పాలన్నదే తన ప్రయత్నమన్నారు. మహిళను అణగదొక్కాలంటే ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిస్తే చాలనుకునే ప్రాచీన సమాజం మారి మహిళలు అభివద్ధిపథంలో నడుస్తున్నా టీడీపీ నాయకులు మాత్రం మహిళా సాధికారతకు కాలరాస్తున్నారని అన్నారు. తనను అడ్డుతొలగిస్తే వారిని ప్రశ్నించే వారు ఎవరూ ఉండరని ఒక పథకం ప్రకారం తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడటం జరిగిందన్నారు. తొలుత అయ్యన్న పాత్రుడి నుంచి మొదలై బండారు సత్యనారాయణ, టీవీ5 అసోసియేట్‌ ఎడిటర్‌ రాజేంద్ర ప్రసాద్‌, గాలి భాను ప్రకాష్‌ అంటూ ఒకరి తరువాత ఒకరు తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడారన్నారు. వ్యక్తిత్వం గురించి నలుగురిలో అసహ్యంగా మాట్లాడి భయబ్రాంతులకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేయాలి, నన్ను నా కుటుంబాన్ని శాశ్వతంగా దూరం చేసేయాలి అన్న దుర్బుద్దే దీనికి కారణమన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ధైర్యంతో ముందుకు నడిచి రాష్ట్ర మంత్రిగా, సినిమాల్లో రాణించిన ఒక సెటబ్రిటీగా తనకే ఈ పరిస్థితి ఉందంటే సాధారణ మహిళ ఇలాంటి వారిని తట్టుకొని ఎలా రాణించగలుగుతుందన్నారు. అలాంటి సాధారణ మహిళ కూడా సమాజంలో గౌరవించబడాలి, ఎలాంటి అడ్డంకులు లేకుండా జీవితంలో రాణించాలనే నా ఈ పోరాటమన్నారు. కోర్టు ఈ కేసును విచారించి వారికి శిక్ష వేస్తుందని నమ్ముతున్నానన్నారు.
మూడు సెక్షన్ల క్రింద కోర్టు నోటీసులు
బండారు సత్యనారాయణ, టీవీ5 అసోసియేట్‌ ఎడిటర్‌ రాజేంద్ర ప్రసాద్‌, గాలి భానుప్రకాష్‌లపై మూడు సెక్షన్ల క్రింద విడివిడిగా కోర్టు నోటీసులను అందించినట్లు మంత్రి రోజా తరపు న్యాయవాది రవీంద్ర తెలిపారు. సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మహిళను కించపరిచేలా మాట్లాడటం, నిందలు మోపడం పది మందిలో అవమానపరచడం, సినీవర్గాల్లో చిన్నచూపు చూసేలా చేయడం లాంటివి జరిగిందన్నారు. ఈఅంశాలు మంత్రిని ఎంతో బాధించిందన్నారు. దీంతో పరువునష్టం కలిగించినందుకు 499, 500 ఐపీసీ క్రింద, మహిళపై నిందమోపి భయబ్రాంతులకు గురిచేసినందుకు ఐపీసీ 354, 506 సెక్షన్ల కింద కేసులు, ఇరువర్గాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఉన్నందున సెక్షన్‌ 153ఎ కింద కేసులు నమోదుచేసి నోటీసులు అందించామన్నారు. త్వరలో వారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.