Aug 15,2023 22:36

తాళాసు రాజు మృతదేహం

* పెద్దపాడులోని ఓ వైద్యుడి ఇంట్లో రక్తపుమడుగుల్లో మహిళ
* సమాచారం తెలుసుకుని జిల్లాకు వచ్చిన డాక్టర్‌
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి :
శ్రీకాకుళం నగరం పెద్దపాడు రోడ్డులోని ఓ ఇంట్లో మహిళ దారుణ హత్యకు గురైంది. విశాఖలో ఉంటున్న విశ్రాంత డాక్టర్‌ గొల్లంకి జగన్నాథం ఇంట్లో తాళాసు రాజు (35) అనే మహిళ మంగళవారం ఉదయం రక్తమడుగులో విగతజీవిగా కనిపించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎచ్చెర్ల మండలం పొన్నాడకు చెందిన రాజు పెద్దపాడు రోడ్డులోని వీరన్నషెడ్‌ దగ్గర ఉన్న డాక్టర్‌ జగన్నాథం ఇంట్లో పనిమనిషిగా చేరింది. జగన్నాథం కుటుంబం విశాఖపట్నంలో ఉంటుండడంతో చిట్టెమ్మ అనే పనిమనిషితో పాటు అదే ఇంట్లో నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం రాజు రక్తపు మడుగులో శవమై కనిపించడంతో మరో పని మనిషి చిట్టెమ్మ విశాఖలో ఉన్న వైద్యుడికి సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న జగన్నాథం కుటుంబ సభ్యులతో శ్రీకాకుళం చేరుకున్నారు. ఘటనపై శ్రీకాకుళం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం డిఎస్‌పి వై.శృతి, సిఐ సన్యాసినాయడు, ఎస్‌.విజరుకుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి డాక్టర్‌ జగన్నాథం, చిట్టెమ్మతో మాట్లాడారు. తలపై బలమైన గాయాలు ఉండడంతో ఎవరో హత్య చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్‌ టీమ్‌ సేకరించిన వివరాలతో పాటు డాగ్‌ స్క్వాడ్‌ వెళ్లిన మార్గాలను బట్టి ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాలు, ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రాజు కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యుడి ఇంటికి చేరుకుని భోరున విలపించారు. ఘటనపై కేసు నమోదు చేశామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.