- ఎన్‌జిఒ అసోసియేషన్ రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తంనాయుడు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: నిరంతరాయంగా ఉద్యోగుల పక్షాన పోరాడి హక్కులను సాధించుకుంటున్న ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలను ఆగస్టు 20, 21 తేదీలలో విజయవాడలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు తెలిపారు. మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని ఎన్‌జిఒ హోంలో జిల్లా కార్య నిర్వాహక కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుధీర్ఘ పోరాట చరిత్ర కలిగిన ఎన్‌జిఒ అసోసియేషన్ 21వ రాష్ట్ర మహాసభలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానున్నారని చెప్పారు. మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా పది వేల మంది ఉద్యోగులు హాజరు కానున్నారని తెలిపారు. మహాసభల ద్వారా ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా మహాసభలకు తరలి రావాలన్నారు. మహాసభలకు హాజరయ్యే ఉద్యోగులకు మూడు రోజుల పాటు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, మెరుగైన ఐఆర్‌తో పాటు పిఆర్‌సి సాధనకు సంఘం కృషి చేస్తోందని చెప్పారు. సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతు సాయిరాం, చల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పండగ వాతావరణంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న మహాసభల్లో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం కావాలన్నారు. సమావేశంలో ఉద్యోగ సంఘ నాయకులు కె.జయరావు, ఆర్.వేణుగోపాల్, గోవింద పట్నాయక్, కె.శ్రీనివాసరావు, తుమ్మిడి సోమేశ్వరరావు, డి.శశిభూషణరావు, బడగల పూర్ణచంద్రరావు, బొచ్చ శ్రీనివాసరావు, పి.శ్రావణి, కె.రోజాకుమారి తదితరులు పాల్గొన్నారు.










