Oct 21,2022 22:52

ప్రజాశక్తి-జగ్గయ్యపేట
నవంబర్‌ 1న మైలవరంలో జరిగే ఎన్టీఆర్‌ జిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా 9వ మహసభలు జయప్రదం చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా బిల్లింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ సిహెచ్‌ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. మండలంలోని గండ్రాయి గ్రామంలో శుక్రవారం బిల్డింగ్‌ వర్కర్స్‌ తో కలిసి మహాసభల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిల్లి నరసింహారావు, ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ నవంబర్‌ 1వ తేదీ ఉదయం 9 గంటలకు కార్మికులచే ప్రదర్శన, 10 గంటలకు బహిరంగ సభ మార్కెట్‌ యార్డ్‌లో జరుగుతుందని తెలిపారు. కొత్త ఇసుక పాలసీ పేరుతో ఇసుక క్వారీలు ఆపివేయటం, మూడు రాజధానుల నిర్ణయంతో రాజధాని చుట్టుప్రక్కల జిల్లాల్లో నిర్మాణాలు నిల్చిపోవడం, జిఎస్టితో సిమెంట్‌, ఐరన్‌ తదితర నిర్మాణ మెటీరియల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయి నిర్మాణ రంగం కుదేలైందన్నారు. ఫలితంగా నిర్మాణ రంగం మీద ఆధారపడిన లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయారని, బిల్డర్లు, యజమానులు తీవ్రంగా నష్టపోయారని, నిర్మాణ రంగ చరిత్రలో మొదటిసారి నిర్మాణ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడే స్థితి వచ్చిందని తెలిపారు. ఈ మహాసభలో నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు షేక్‌ గౌస్‌ మియా, సిఐటియు నాయకులు ఎస్‌ రామనాథం, బిల్డింగ్‌ వర్కర్లు షేక్‌ హుస్సేన్‌, బాజ్జి, కష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.