Aug 02,2021 12:39

ముంబయి : శివసేన భవన్‌ను కూల్చి వేస్తామంటూ బిజెపి నేత ప్రసాద్‌ లాద్‌ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ మండిపడింది. ఆ పార్టీ ప్రవర్తన చూస్తుంటే... మహారాష్ట్రలో బిజెపికి కాలం చెల్లిపోయే రోజులు దగ్గరపడ్డాయని పార్టీ పత్రిక సామ్నాలో దుమ్మెత్తిపోసింది. శివసేన భవన్‌పై ఎవరెన్ని చిన్న చూపు చూశారో.. ఆ పార్టీ, ఆ నేతలు వర్లి గట్టర్లలో కొట్టుకుపోయారని విమర్శించింది. శివసేన భవన్‌ కూలిపోతుందని కొందరు దిగిజారుడు బిజెపి వ్యక్తులు మాట్లాడటం... అందుకు మరాఠీ నాయకులు చప్పట్లు చర్చడం.. మరాఠా గౌరవానికి కళంకం కాదా? అని ప్రశ్నించింది. శివసేన భవన్‌లో బాలాసాహెబ్‌ థాకరేతో పాటు చత్రపతి శివాజీ మహారాజ్‌ ప్రతిమలు ఉన్నాయని పేర్కొంది. బిజెపికి ఒకప్పుడు నమ్మకమైన కార్యకర్తలు ఉండేవారని, అట్టడుగు వర్గాల వారితో అనుసంధానం ఉండేదని తెలిపింది. బయటి వ్యక్తులు, దిగజారిపోయిన వారికి ఇక్కడ చోటు ఉండేది కాదని, కానీ ఇప్పుడు పార్టీ వాస్తవ భావజాలాన్ని కల్గి ఉన్న నేతలు, నీచమైన వారిని ముందుకు తీసుకువస్తున్నారని విమర్శించింది. అందుకే పార్టీకి పోయే కాలం దగ్గర పడిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా, శనివారం జరిగిన ఓ సభలో ప్రసాద్‌ మాట్లాడుతూ... సమయం వస్తే.. శివసేన భవన్‌ను కూల్చి వేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. శివసేనకు కంచుకోటగా ఉన్న మహిమ్‌లో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఆయన తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు.