ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
జిల్లా సమగ్రాభివృద్ధికి సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టే మహాపాదయాత్రను జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.ఆనంద్‌బాబు కోరారు. ఆదివారం పట్టణంలోని శివ సర్కిల్ వద్ద ఉన్న కెవిపిఎస్ జిల్లా ఉప కార్యాలయంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్.దేవసహాయం అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్‌బాబు మాట్లాడారు. వెనుకబడిన జిల్లా అభివృద్ధిని కోరుతూ, ప్రాజెక్టులు, పరిశ్రమలు నిర్మించాలని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి చూపాలని, విద్య, వైద్య రంగాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. దళితుల సమస్యలను కూడా ప్రధాన అజెండాగా చేర్చి నిర్వహిస్తున్న సిపిఎం మహా పాదయాత్రకు సంపూర్ణ సంఘీభావం తెలియజేసి, పాదయాత్రలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఆదోని మండలం హానవాలు మొదలుకొని, పెద్దహరివాణం, దొడ్డనగేరి, నాగనాథహళ్లి, సంతేకుడ్లూరు, తుగ్గలి మండలం రాతన, గూడూరు మండలం గుడిపాడు, సిబెళగల్ మండలం బ్రాహ్మణపల్లె, పత్తికొండ మండలం హోసూరు, కోడుమూరు మండలం అనుగొండతో పాటు మరో 10 గ్రామాల్లో ప్రతిఘటన పోరాటాలు నిర్వహించామని తెలిపారు. ప్రతిఘటన పోరాటం నిర్వహించిన ప్రతి ప్రాంతంలోనూ సిపిఎం దళితులకు అండగా నిలిచిందన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధిని కోరుతూ ఈనెల 26 నుంచి 31 వరకు ఆదోని నుంచి కర్నూలు దాకా మహా పాదయాత్రను చేపట్టడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. పాదయాత్రకు సంఘీభావం తెలియజేసి, ప్రత్యక్షంగా పాల్గొని, దళితుల సమస్యలను ప్రధాన రాజకీయ అజెండాగా మారుద్దామని కోరారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు డి.విజయమ్మ, ఎన్‌జి.కృష్ణ, బి.కరుణాకర్, హెచ్.జయరాజు, జిల్లా సహాయ కార్యదర్శులు గిత్తరి రమేష్, ఆండ్రా గురుస్వామి, ఎం.భాస్కర్, మామిడికాయల రాజు, హెచ్.చిన్న మారయ్య, చర్మకార వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సుమాల ఆంథోని, కోసిగి, పెద్దకడబూరు, దేవనకొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు మండలాల కార్యదర్శులు రామకోటి హనుమంతు, కెబి.ఆనందరాజు, ఎం.రాజు, ఈశ్వరయ్య, రాజా రమేష్, జిల్లా కమిటీ సభ్యులు చిన్న రోషన్న, చక్రపాణి, లాజర్, మదన గోపాల్, డేవిడ్ రాజు, సుమాల రాజు, నాగప్ప, కుశలన్న పాల్గొని మాట్లాడారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఆనంద్ బాబు










