
మహానందిలో ఎలుగుబంటి
- గత నాలుగు రోజులుగా సంచారం - భయాందోళనలో గ్రామస్తులు, భక్తులు
ప్రజాశక్తి - మహానంది
మహానంది క్షేత్రంలో గత నాలుగు రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తోంది. స్థానికులు, భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బుధవారం రాత్రి ఎలుగుబంటి పాత వివేకానంద పాఠశాల మైదానం పరిసర ప్రాంతాల్లో ప్రత్యక్షం కావడంతో స్థానికులు కెమెరాల్లో బంధించి అటవీ శాఖ అధికారులకు చేరవేశారు. స్థానికులు కేకలు వేయడంతో ఎలుగుబంటి మళ్లీ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిది. గత కొన్ని రోజుల క్రితం ఇలాగే అటవీ ప్రాంతం నుండి క్షేత్రంలోని జనావాస ప్రాంతంలోకి ఎలుగుబంటి వస్తుండడంతో స్థానికులు, దేవస్థానం అధికారులు అటవీ శాఖకు సమాచారాన్ని ఇచ్చారు. దీంతో ఎలుగుబంటిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలారు. మళ్లీ ప్రస్తుతం మూడు నాలుగు రోజుల నుంచి క్షేత్ర సమీప ప్రాంతాల్లో సంచరిస్తుండడంతో స్థానికులతో పాటు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం వారు మైకుల ద్వారా భక్తులను, స్థానికులను తగు జాగ్రత్తలు తీసు కోవాలని, గుంపులుగా ఉండాలని సూచిస్తున్నారు. అటవీశాఖ సిబ్బంది కూడా దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి గురువారం తీసుకుపోయినట్లు సమా చారం. బుధవారం రాత్రి మహానందిలోని అటవీశాఖ సిబ్బంది, అధికారులు దీనిపై నిఘా ఉంచారు. భక్తులకు, గ్రామస్థులకు ఎలుగుబంటి నుంచి ఎలాంటి హాని జరగకముందే త్వరగా అటవీ శాఖ అధికారులు బంధించి అడవిలోని లోపలి ప్రాంతంలో వదిలిపెట్టాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.