ఉంగుటూరు : సమాజ అభివృద్ధికి కృషి చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకుని, విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని టీచర్స్ ఎంఎల్‌సి షేక్ సాబ్జి తెలిపారు. ఉంగుటూరు మండలంలో మహనీయుల జీవిత స్ఫూర్తిని తెలిపే కృషి చేస్తున్న కమిటీ వారికి అభినందనలు తెలిపారు. మహనీయుల ఆశయాల ప్రచార కమిటీ, ఉంగుటూరు మండలం కమిటీ సోమవారం ఏర్పాటు చేసిన విద్యాలయాల సభలకు సాబ్జి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉంగుటూరు జిల్లా పరిషత్ హైస్కూల్ సభకు ప్రధాన ఉపాధ్యాయురాలు తోట మీనాకుమారి అధ్యక్షత వహించారు. సభలో మండల విద్యాశాఖ అధికారి కె.శ్రీనివాస్, ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, మహనీయుల ఆశయ కమిటీ ఉంగుటూరు అధ్యక్షులు డాక్టర్ కొండా రవి, కార్యదర్శి యు.రాంబాబు, సభ్యులు డి.జోగి నాయుడు, సిహెచ్.శ్రీథర్ పాల్గొన్నారు. బొమ్మిడి జిల్లా పరిషత్ హై స్కూల్‌లో జరిగిన సభకు పి.శ్రీదేవి ప్రధానోపాధ్యాయులు అధ్యక్షత వహించారు. కైకరం హై స్కూల్‌లో జరిగిన సభకు ప్రధానోపాధ్యాయులు జి.ప్రసాద రావు అధ్యక్షత వహించారు. అక్కుపల్లి గోకవరం ప్రాథమికోన్నత పాఠశాలలో సభకు హెడ్ మాస్టర్ జి.ఆనందరావు అధ్యక్షత వహించారు. ఆయా సభలలో స్కూల్స్‌కు పొత్తూరి శ్రీనివాసరాజు సౌజన్యంతో మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్ర పటాలు, అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర పుస్తకాలు, ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం ముద్రించిన మహనీయుల జయంతులు, వర్థంతుల తేదీలు తెలియజేసే క్యాలెండరు హెడ్ మాస్టర్‌లకు అందజేశారు.
కైకరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జీవి నరసింహారావు మాట్లాడుతూ మహనీయుల నుంచి మంచి గుణగణాలు, దేశభక్తిని నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు గుత్తికొండ కృష్ణ మాట్లాడుతూ సిపిఎం, ప్రజాసంఘాల ద్వార కైకరంలో ప్రజాసంఘాల భవనం ఏర్పాటు చేశామన్నారు. ఈ భవనంలో ఉచితంగా ట్యూషన్ క్లాసులు, కంప్యూటర్ క్లాసులు విద్యార్థులుకు నిర్వహిస్తామని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోమని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌలురైతు సంఘం కన్వీనర్ కొర్ని అప్పారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










