ఇదంతా విన్న సదానందం ''కాని మళ్ళీ ఓ డౌటు. ''ఇవన్నీ మోడీ కష్టాలు కదా? మన మహానేత కు ఎందుకు అంత సానుభూతి? ఈయనకొచ్చిన కష్టం ఏమిటో?'' అన్నాడు. దానికి సందేహాలరావు ''అదే మరి, ఏమీ తెలియనట్టు అడుగుతారు మీరు. మోడీ నుండి ఏ కష్టమూ రాకూడదనే కదా ఈ తాపత్రయమంతా'' అన్నాడు.
గురజాడ కన్యాశుల్కం నాటకంలో అయిదో అంకంలో సారా కొట్టు వెనుక తోటలో బైరాగి గ్రామ మునసబు, సాతాని మనవాళ్ళయ్య, జంగం వీరేశ, దుకాణదారు రామదాసు అందరినీ కూచోబెట్టి అందరూ కలిసి తాగుతూ వుంటారు. వాళ్ళకి ఆ బైరాగి ''వుప్పు దేశం'' (జంగం వీరేశ మాటల్లో) చేస్తూ వుంటాడు.
''వెర్రి! వెర్రి! నిజమేమిటి, అబద్ధమేమిటి? మేం సిద్ధులం అబద్ధం నిజం చేస్తాం, నిజం అబద్ధం చేస్తాం. లోకమే పెద్ద అబద్ధం. పదండీ'' అంటూ ఆ బైరాగి దొంగ సాక్ష్యం చెప్పడానికి రామప్ప పంతులుకి తోడవుతాడు.
ఇదిగో, అలా ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కి మన రాష్ట్ర అధినేత ఓ మహత్తరమైన ''వుప్పుదేశం '' చేశారు. ఈ కరోనా కష్టకాలంలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోరాదని, అందరూ ఈ పరీక్షా సమయంలో ప్రధానికి అండగా నిలవాలని ట్వీట్ చేశారు. దానిని దేశంలో అన్ని పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి. మర్నాడే ఆ వార్తను చదివిన మన సందేహాలరావుకి చాలా సందేహాలు వచ్చేశాయి. దాంతో కడుపు ఉబ్బిపోయింది.
ఫ్యామిలీ డాక్టరు సదానందం దగ్గరికి వెళ్లాడు. ఆయనకి ఈ పేషెంటు గురించి బాగా తెలుసు. అంచాత తాపీగా అడిగాడు ''ఏమిటి నీకొచ్చిన సందేహాలు ?''
సందేహాల రావు తన మొదటి సందేహాన్ని చెప్పాడు.
''కష్ట కాలంలో ఒకరికి ఇంకొకరు తోడుగా ఉండాలి అని అధినేత చెప్పినది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. అయితే, ఇప్పుడు ప్రధాని జార్ఖండ్ ముఖ్యమంత్రికి అండగా ఉండాలా లేక హేమంత్ సొరెన్ మోడీ కి అండగా ఉండాలా ?''
ఈ సందేహం విన్న సదానందం కన్‌ఫ్యూజ్ అయ్యాడు. దాంతో ఆయనకీ సందేహం వచ్చింది.
''ఆగాగు! కష్ట కాలంలో ఒకరికొకరు అండగా ఉండాలి అన్నది కరెక్టే కదా? మరి ఈ డౌటెందుకొచ్చింది నీకు ?'' అనడిగాడు.
అప్పుడు సందేహాలరావు వివరించాడు. ''కష్టం వచ్చిన వాళ్ళు ఒకరికొకరు అండగా ఉండాలి. ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రం దేశంలో అతి వేగంగా కరోనా రెండో విడత పెరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో ఒకటి. కనుక జార్ఖండ్ కి అండ అవసరం. మరి మోడీకి అండ ఎందుకు? ప్రధాని దేశం మొత్తం మీద కరోనా సమస్యకి బాధ్యత తీసుకుంటున్నాడా అంటే అటువంటిదేమీ లేదు. కనీసం ఆక్సిజన్ బాధ్యత కూడా తీసుకోవడం లేదని కదా సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది?
ఇక వ్యాక్సిన్ అందరికీ అందించాలి అని ఆదేశాలు ఇచ్చేశాడు. ఎవరు ఇవ్వాలి? ఎవరిది బాధ్యత? ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ లో సగం కేంద్రానికి డోసుకి రూ.150 చొప్పున కేటాయించుకున్నారు. తక్కినదాంట్లో వాటాల కోసం రాష్ట్రాలను, ప్రైవేటు ఆస్పత్రులను తన్నుకు చావమన్నారు. పోనీ, ఆ కేంద్రం వాటాలో ఎవరెవరికి వ్యాక్సిన్ లను అందిస్తారో అదైనా చెప్పారా అంటే అదీ లేదు.
కరోనా టెస్టులో పాజిటివ్ రాకపోయినా అడిగిన వాడికల్లా ఆస్పత్రిలో బెడ్లు ఇచ్చేయమన్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్లకే దిక్కు లేదు. ఇక అడిగిన వాళ్ళకందరికీ బెడ్లు ఇవ్వాలంటే ఎక్కడి నుండి తేవాలి? కేంద్రం ఏమైనా అదనంగా బెడ్లు సప్లై చేస్తుందా?
ఏ మందులు వాడాలి, ఏవి అనవసరం అని సూచనలు తాజాగా ఇచ్చేశారు. ఆ మందులు మార్కెట్లో దొరకడం లేదు. బ్లాక్ లో చాలా ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. పోనీ ఆ మందులను సరఫరా చేసే బాధ్యత ఏమైనా కేంద్రం తీసుకుందా అంటే అదీ లేదు.
కరోనా కేసులొస్తే వాటిని రాష్ట్రాల వారీ ఖాతాల్లో వేసి ఆయా రాష్ట్రాలదే పూర్తి బాధ్యత అంటున్నారు.
అంచేత ఏ బాధ్యతా లేని కేంద్రానికి వచ్చిన కష్టం ఏమిటి? మోడీ కి మనమంతా అండగా ఎందుకు నిలబడాలి? నిజానికి ఇప్పుడు మనకందరికీ అండగా నిలబడాల్సింది మోడీ కదా?
సదానందానికి క్లారిటీ వచ్చింది. దాంతో బాటు ఇంకో డౌటు వచ్చింది. ''మరి మన మహానేత మనమంతా మోడీకి ఈ కష్టకాలంలో తోడుగా నిలవాలని ఎందుకు అన్నాడు?''
అప్పుడు సందేహాలరావు ఇలా వివరణ ఇచ్చాడు ''కష్టం అంటే కరోనా యే అని ఎందుకు అనుకోవాలి? కరోనా ప్రజలకి, వైద్యులకి, అధికారులకి. ప్రజల పట్ల బాధ్యత ఉన్న వాళ్ళకి కష్టం. కాని మోడీ కష్టాలు వేరుగా ఉండొచ్చు కదా'' అన్నాడు. మచ్చుకి కొన్ని వివరించమన్నాడు సదానందం.
''ఈ మధ్య ఎన్నికల్లో బిజెపి చతికిలబడింది. దేశమంతటా తానే అయి తిరిగాడు మోడీ. అయినా ఓడిపోయారు. గెలిచిన అస్సాం లో కూడా ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. బెంగాల్ లో ఆఖరుకు తృణమూల్ కి కూడా పనికిరాని సరుకునంతా తెచ్చి పార్టీలో చేర్చుకుని అభాసుపాలయ్యారు. ఇప్పుడు వాళ్ళంతా బిజెపి కి పెద్ద తలనొప్పిగా మారారు. యు.పి లో స్థానిక ఎన్నికల్లో ప్రధాని నియోజకవర్గం వారణాసి లోనే బిజెపి ఓడిపోయింది.''
''ఇంకో పక్క రైతులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. వాళ్ళకి అలసట ఎప్పుడొస్తుందో మోడీకి తెలియడం లేదు. అంతర్జాతీయంగా, దేశంలోను సోషల్ మీడియా బిజెపి పాలనను, చేతకానితనాన్ని దుమ్మెత్తి పోస్తోంది. ఎంత భయపెట్టినా, ఎన్ని దేశద్రోహం కేసులు బనాయించినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు ''
''పోనీ, కుంభమేళా సక్సెస్ అని చెప్పుకుందామా అంటే ఆ కుంభమేళాతో సక్సెస్‌ఫుల్‌గా కరోనా దేశమంతా శరవేగంగా విస్తరించిందని అందరూ తిట్టిపోస్తున్నారు. ఏదో, రోజుకో పావలా లెక్కన పెట్రో రేట్లు పెంచి ఏడాదికో నాలుగైదు లక్షల కోట్లు ఖజానాకు, అక్కడి నుంచి కార్పొరేట్లకు చేర్చుదామంటే దానిమీద కూడా ఉతికి ఆరేస్తున్నారు. దేశభక్తి మంత్రం పారడం లేదు. చూశారా ఎన్ని కష్టాలో ! వీటి ముందు ఆఫ్ట్రాల్! కరోనా ఓ లెక్కా?''
ఇదంతా విన్న సదానందం అదీ నిజమేనని ఒప్పుకున్నాడు. కాని మళ్ళీ ఓ డౌటు. ''ఇవన్నీ మోడీ కష్టాలు కదా? మన మహానేత కు ఎందుకు అంత సానుభూతి? ఈయనకొచ్చిన కష్టం ఏమిటో?''
దానికి సందేహాలరావు ''అదే మరి, ఏమీ తెలియనట్టు అడుగుతారు మీరు. మోడీ నుండి ఏ కష్టమూ రాకూడదనే కదా ఈ తాపత్రయమంతా'' అన్నాడు.
సదానందానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఐ.టి డిపార్టుమెంట్లు గుర్తుకొచ్చాయి. దాంతో క్లారిటీ వచ్చేసింది.
అప్పుడు సదానందం ''ఇంతకీ మీకొచ్చిన తక్కిన సందేహాలేమిటి?'' అనడిగాడు.
అప్పుడు సందేహాలరావు ''ఇది మరీ బాగుంది డాక్టరు గారూ, సందేహాలు మీవి. తీర్చినది నేను. మీ దగ్గరకు వచ్చేక వ్యవహారం రివర్స్ అయింది '' అన్నాడు.
''మరదే కిటుకు, నాకొచ్చిన సందేహాలకి నీ దగ్గర సమాధానాలు తెలుసుకున్నాను. కాని నీకే నేను ట్రీట్‌మెంట్ ఇచ్చినట్టు బైట ఉన్న పేషెంట్లు అనుకుంటారు. ఇదే కదా మోడీ స్టైల్ !'' అని సదానందం ఫీజు కోసం చెయ్యిజాపాడు.
ఫీజు ముట్టజెప్పుకుని, అనవసరంగా వచ్చేనేమో అనుకుంటూ సందేహాలరావు బైట పడ్డాడు...అనవసరంగా మోడీకి ఓట్లేసేమేమో అని చాలా మంది ఓటర్లు అనుకుంటున్న విధంగానే.










