ప్రజాశక్తి - ఆదోని
రాజమండ్రిలో జరిగిన మహానాడు సాక్షిగా టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు బృహత్తర పథకాలతో టిడిపి మేనిఫెస్టో ప్రకటించారని టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు తెలిపారు. బుధవారం టిడిపి కార్యాలయంలో ఎన్‌టి.రామారావు, చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1500, తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమంది పిల్లలకు ఏడాదికి రూ.15 వేలు, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికీ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం కింద మహిళలకు టికెట్ లేని ప్రయాణం కల్పించడం వంటి బృహత్తర పథకాలను మహానాడు వేదిక సాక్షిగా ప్రవేశ పెట్టడం సంతోషకరమని చెప్పారు. అన్నదాత పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికీ యువగళం నిధి కింద నెలకు రూ.3వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. నాయకులు దొడ్డనగేరి శివప్ప, వాల్మీకి వెంకటేష్, రామకృష్ణ, సజ్జాద్, రామాంజనేయులు, మాజీ కౌన్సిలర్ బాలాజీ, దుబ్బనకల్లు లక్ష్మణ్, మల్లికార్జున, మహిళా నాయకులు పాల్గొన్నారు. నందవరం కోట వీధిలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మాధవ్ రావు దేశాయి మహిళలు, రైతులతో కలిసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయించారు. టిడిపి నాయకులు షరీఫ్, ఇషా, ఈరన్న, మల్లికార్జున, శీను, మోహన్, పంపయ్య పాల్గొన్నారు.










