
ప్రజాశక్తి-యంత్రాంగం
ఉక్కునగరం : సామాజిక న్యాయం కోసం విజయవాడలో ఈ నెల 29వ తేదీన జరుగుతున్న మహాధర్నాను జయప్రదం చేయాలని కుల వివక్ష పోరాటం సంఘం ఆధ్వర్యాన పాత వడ్లపూడిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ నాయకులు వైటి.దాస్ మాట్లాడుతూ, దళితులపై దాడులు, అత్యాచారాలు, గ్రామ బహిష్కరణలు నేటికీ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితులపై దాడులను తీవ్రతరం చేస్తున్నారన్నారు. మోడీ దివాలా కోరు విధానాల వల్ల దళితుల హక్కులపై తీవ్ర దాడి జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జనరల్ సెక్రటరీ తిరికోటి చిరంజీవి, జిల్లా అధ్యక్షులు ఎం.సుబ్బన్న, కె.అప్పారావు, ఎస్.సత్యనారాయణ, నూకరాజు, సంతోష్‌కుమార్‌రాజు, మనోజ్ కుమార్ పాల్గొన్నారు.
పిఎం.పాలెం : దళిత హక్కుల పరి రక్షణ కోసం ఈ నెల 29న విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరిగే మహా ధర్నాకు తరలిరావాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా కార్యదర్శి ఎంవి.ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను జివిఎంసి జోన్-2 కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం మధురవాడ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ రంగాన్ని ప్రయివేట్ పరం చేస్తూ, గిరిజనులకు, దళితులకు, బిసిలకు రిజర్వేషన్ లేకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే 41 సిఆర్‌పిసిని రద్దు చేయాలని, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు ప్రకారం మిగులు భూమి పేదలకు పంపిణీ చేయాలని కోరారు. ఎస్‌సి, ఎస్‌టిలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సక్రమంగా అమలు చేయాలని, దీనిని 300 యూనిట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు ఎస్ పైడితల్లి, కె.నాగరాజు, బి.వరలక్ష్మి, ఎస్.రమణమ్మ, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.