ప్రజాశక్తి- బొబ్బిలి : అంగన్వాడి వర్కర్స్ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 25న విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి. శంకరరావు కోరారు. అంగన్వాడి సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తలతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో జీతం పెంచి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. సుప్రీంకోర్టు రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాడ్యూటీ, పెన్షన్ చెల్లించాలని తీర్పు ఇచ్చినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదన్నారు. అంగనవాడీలపై వేధింపులు పెరిగాయన్నారు. అనేక రకాల యాప్‌లు ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు నాయకులు జె. కామేశ్వరి, బి.నిర్మల, ఎన్. కామేశ్వరి, ఉమాగౌరి పాల్గొన్నారు.










