Sep 25,2023 21:20

పోస్టర్లు ఆవిష్కరిస్తున్న కెవిపిఎస్‌, వ్య.కా.స నాయకులు

 కడప అర్బన్‌ దళితులపై దాడు లు, అత్యాచారాలు అరికట్టాలని సామాజిక న్యాయం కోసం ఈనెల 29 విజయవాడలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే మహా ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి. శివకుమార్‌, వి. అన్వేష్‌ తెలిపారు. సోమవారం సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద మహా ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టిటి సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించి సమగ్రంగా చట్టాన్ని అమలు చేయాలన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ, జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫారసులు అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్‌ ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి. వెంకటేష్‌, ఎస్‌. వీరయ్య, కె. నర్సయ్య పాల్గొన్నారు.