ప్రజాశక్తి-కాకినాడ ఈ నెల 27, 28 విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రెండు రోజులపాటు నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు పిలుపు ఇచ్చారు. సిఐటియు కార్యాలయంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అధ్యక్షతన గురువారంకార్మిక, రైతు సంఘాల సన్నాహక సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, కౌలు రైతులకు రుణాలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉపాధి హామీ కార్మికులకు కనీస వేతనం రూ.600 చొప్పున 200 రోజులకు పని దినాలను పెంచాలని, నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసి, స్కీమ్ వర్కర్లందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పిఆర్‌సి అమలు చేయాలని కోరుతూ ఈ ధర్నా చేపట్టినట్టు తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జల్లూరి వెంకటేశ్వర్లు, ఐఎన్‌టియుసి ఎపి, తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు మాట్లాడారు. రైతాంగం పోరాట ఫలితంగా పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేస్తానని మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీ రెండేళ్లు గడుస్తున్నా అమలు చేయలేదన్నారు. కార్మికులను నయా బానిసలుగా మార్చేందుకు ఉన్న హక్కులను తొలగిస్తూ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఏర్పడిన కరువు ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు తక్షణం ప్రభుత్వరంగం ఆధ్వర్యంలో సంస్థను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలపై భారాలు మోపేందుకు తీసుకువస్తున్న విద్యుత్ సవరణ చట్టం ప్రకారం స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 19న అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాలని, మహాధరాపై 24, 25 తేదీల్లో ప్రచారజాతా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.