ప్రజాశక్తి - పిఠాపురం
సామాజిక న్యాయం, దళిత సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ఈ నెల 29న చేపట్టిన మహాధర్నాను జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కె.సింహాచలం పిలుపు నిచ్చారు. మంగళవారం మండలంలోని పి.రాయవరం కమ్యూనిటీ హాల్ వద్ద మహా ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఉబా బుల్లెబ్బాయి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కె.సింహాచలం మాట్లాడారు. దళిత, గిరిజనలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. సబ్ ప్లాన్ చట్టాన్ని పూర్తిగా ఎత్తివేయడం, ఎస్‌సి, ఎస్‌టి కార్పొరేషన్ నిధులను దారి మళ్లించడం, ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన 26 రకాల పథకాలను ఎత్తివేయడం అన్యాయమన్నారు. అసైన్మెంట్ చట్టంలో తీసుకొచ్చిన కొత్త ఆర్డినెన్స్‌తో పేదలకు భూములు దూరమవుతాయన్నారు. దళిత, గిరిజనులకు అందించే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను 300 యూనిట్లకు పెంచాలన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు. వీటి కోసం నిర్వహించే చలో విజయవాడను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కాలదారి రాఘవ, కె.ప్రసాద్, భారతి, కె.లోవమ్మ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.










