మహా శివరాత్రి వేడుకలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో శివాలయాలు కిటకిటలాడాయి. శివరాత్రి సందర్భంగా పలు ఆలయాల వద్ద అన్నసమారాధన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజాశక్తి- కె.కోటపాడు : మహాశివరాత్రి సందర్భంగా శనివారం మండలంలోని పలు గ్రామాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం వరకు భక్తులు క్యూలో నిలబడి శివుని దర్శించుకున్నారు. చౌడువాడ, కె.కోటపాడు, ఎ.కోడూరు, ఆనందపురం గ్రామాలలో ఉన్న శివాలయాల వద్ద అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఆలయాల వద్ద మహిళల కోలాటాలు, భజనలు, తప్పుడు గుళ్ళు నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు చౌడువాడ, కె.కోటపాడు శివాలయాలను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో చౌడువాడ సర్పంచి దాడి ఎరుకు నాయుడు, ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, సుగర్ ఫ్యాక్టరీ మాజీ డైరెక్టర్ రాజి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పరవాడ : పరవాడ మల్లికార్జున స్వామి ఆలయంలో వైసిపి రాష్ట్ర సీఈసీ సభ్యులు పైలా శ్రీనివాసరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పల నాయుడు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు, ఉప సర్పంచ్ బండారు రామరావు, ఆర్‌ఇసిఎస్ మాజీ చైర్మన్ చల్ల కనకరావు, వార్డు మెంబర్ పోతాల అప్పలనాయుడు పాల్గొన్నారు. పరవాడ వెన్నెల పాలెం జంక్షన్ వద్ద దత్త సంతోషి సత్యదేవ త్రయంబకేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహ దేవాలయంలో అభిషేకాలు జరిగాయి. పరవాడ, వెన్నెలపాలెం, కలపాక, గొర్లివానిపాలెం, దేశపాత్రునిపాలెం, రావాడ, మెరిసివానిపాలెం, బద్ధపువానిపాలెం, తానాం, బోనంగి తదితర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు చేశారు.
చోడవరం : శివరాత్రి సందర్భంగా మండలంలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక గౌరీశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో క్యూ లైన్‌లు ఏర్పాటు చేశారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. రాయపురాజుపేట, గవరవరం, ముద్దుట్టి, గౌరీపట్నం, గోవాడ, వెంకన్నపాలెం, లక్కవరం గ్రామాల్లో భక్తులు అధిక సంఖ్యలో శివాలయాలను దర్శించారు. అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
కశింకోట : మండలంలోని ఎఎస్.పేట గ్రామంలో సాంబశివ ఆలయంలో విశాఖ డెయిరీ డైరెక్టర్ మలసాల రమణారావు సర్పంచ్ మలసాల ధనమ్మ దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కోలాటం చేసిన రెండు బృందాల సభ్యులను అభినందించారు.
బుచ్చయ్యపేట : మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని దిబ్బిడి, బుచ్చయ్యపేట, నీలకంఠాపురం, రాజాం, సీతయ్యపేట తదితర గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. నీలకంఠాపురం గ్రామంలో అన్న సమారాధన నిర్వహించారు.
మునగపాక రూరల్ : మండలంలోని వాడ్రాపల్లిలో దక్షిణేశ్వర స్వామి ఆలయం, వెంకటాపురంలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయం, నాగులపల్లిలోని పర్వతవర్ధిని సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం, మునగపాకలో సాంబమూర్తి, విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర, భీమలింగేశ్వర స్వామి ఆలయాలు ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడాయి. పలువురు భక్తులు శివునికి అభిషేకాలు, కుంకుమార్చనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అచ్యుతాపురం : మహాశివరాత్రి సందర్భంగా పూడిమడక, వాడపాలెం సముద్రతీరాల్లో భక్తులు స్నానాలు చేసి జాగరణ కార్యక్రమం ప్రారంభించారు. తిమ్మరాజుపేట, పెదపాడు, జగ్గన్నపేట, హరిపాలెం, కొండకర్ల, ఎం జగన్నాధపురం, అచ్యుతాపురం, మోసయ్యపేట, దుప్పుతూరు, మార్టూరు, మడుతురు, దోసూరు తదితర గ్రామాలలో శివాలయాల్లో భక్తులు పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో అన్న సమరాధన నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా జాగరణకై పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చౌడపల్లిలో శివ భక్తులు ప్రత్యేకమైన వేషధారణ ధరించి గ్రామంలో ర్యాలీగా తిరిగారు.
నక్కపల్లి:మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో శివాలయాలు కిటకిటలాడాయి. మండలంలోని ఉపమాక శివాలయంలో శనివారం తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరారు. చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తుల తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మహేష్, సంతోష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ చైర్మన్ చెరుకూరు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. గొడిచెర్లలో శేష లింగేశ్వర స్వామి, పాటిమీద శివాలయంలో భక్తులు బారులు తీరారు.
చీడికాడ:మండల కేంద్రంలో శివాలయంలో భక్తులకు దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు.ఆలయం వద్ద ఎడ్లబండ్ల పందాలు నిర్వహించారు. డాన్స్ బేబీ డాన్స్ వంటి సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొత్తకోట:మహాశివ రాత్రి తీరు నాళ్ళు సందర్బంగా రావికమతం మండలం కల్యాణపులోవ లో తొలి రోజు భక్త జనం పోటేత్తారు. తొలి రోజు సుమారు 70 వేలు మంది భక్తులు హాజరు అయినట్టు దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రతి ఏటా స్థానిక కల్యాణపోతురాజు, పెద్దింటమ్మ తీరునాళ్ళు మూడు రోజుల పాటు నిర్వహిస్తుంటారు. కల్యాణపులోవ జలాశయంలో స్నానాలు ఆచరించి పోతు రాజుబాబు (శివాలయం )పెద్దింటమ్మ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, దేవాదాయ శాఖ, స్థానిక వైసీపీ నాయకుల ఆధ్వ ర్యంలో భక్తులకు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. కొత్తకోట సిఐ సయ్యద్ ఇలియాస్ మహ్మద్, ఎస్‌ఐ విభూషణరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణకు సుమారు 300 మంది సిబ్బందితో గస్తీ నిర్వహించారు. స్నాన ఘట్టాల వద్ద పైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లతో నిఘా ఏర్పాటు చేశారు. దేవాలయం వద్ద ఎంపిపి పైల రాజు, మండల తహసిల్దార్ మహేశ్వరరావు, ఆర్‌ఐ చిన్నబ్బాయి, డిసిఎంఎస్ డైరెక్టర్ సత్యదేవ్, గ్రామ సర్పంచ్ గంగరాజు, ఎంపిటిసి గాలి రమణబాబు ఆతధ్వర్యంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
భక్తుడికి గాయాలు
ఇదిలా ఉండగా తొలి రోజు కళ్యాణపు లోవ జలాశ యం వద్ద పుణ్య స్నానం చేసేందుకు వచ్చిన భక్తుడు ప్రమాదవశాత్తు ఎడమ కాలు విరిగి తీవ్ర గాయమైంది.తక్షణమే స్పందించిన పైర్ సిబ్బంది స్థానిక వైద్య శిభిరానికి తరలించి ప్రధమ చికిత్స అందజేశారు. మైరుగైన చికిత్సకు కొత్తకోట ఆసుపత్రికి తరలించారు.
ఉత్తర వాహినిలో సందడి
నర్సీపట్నం టౌన్: మున్సిపాలిటీలో బలిఘట్టం లో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఉత్తర వాహిని భక్తులతో కిటకిటలాడింది.పాకలపాడు గురుదేవుల ఆలయం లో ఘనంగా పూజలు చేశారు. ఈ ప్రాంతంలో దత్తాత్రేయ, వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.స్థానిక వాసవి క్లబ్ నిర్వాహకులు పాకలపాడు గురువు ఆశ్రమం వద్ద పులిహౌర అందజేశారు.
స్థానిక పెద్ద చెరువు వద్ద కాశీ విశ్వేశ్వర, బలిఘట్టంలో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు శివునికి రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అన్నపూర్ణ ట్రస్ట్, సత్యసాయి సేవ సమితి, నర్సీపట్నం ప్రైవేట్ కళాశాలలు అన్నదానాలు నిర్వహించారు. పాకలపాడు గురుదేవుల విగ్రహాన్ని రథంపై నర్సీపట్నం పురవీధిలో ఊరేగించారు. అయ్యన్న కాలనీలో దక్షిణామూర్తి శివాలయంలో స్వామివారిని అలంకరించారు.
వేడుకలలో ఉప ముఖ్యమంత్రి
మాడుగుల: మహాశివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. మండల కేంద్రంలోని సాగరం రహదారి వద్ద పోతురాజు బాబు పెద్ద మహౌత్సవంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు. మాడుగులలోని ఉబ్బలింగేశ్వరస్వామి, భీమ లింగేశ్వర స్వామి, స్వర్గ లింగేశ్వర ఉమా లింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు జంపెన శివాలయం, పురాతన పిట్టగడ్డ ఆలయాలలో భక్తులు బారులు తీరి పూజలు చేశారు.
కోటవురట్ల:మండలంలో కోటవురట్ల, జల్లూరు, పందూరు శివాలయాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.లింగాపురం, రాజుపేట, వెంకటాపురం, తంగేడు, గ్రామాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు.
రద్దీగా దారమఠం శైవక్షేత్రం
గొలుగొండ:మండలంలోని దారమఠంలో ఉమాదారమల్లేశ్వరస్వామి ఆలయంలో మొదటి రోజున శనివారం వేలాదిమంది భక్తులు తరలి వచ్చారు. మహిళలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 3వేల మంది భక్తులకు మధ్యాహ్నం భారీ అన్నసమారాధన నిర్వహించారు. మూడు రోజులపాటు భారీ బందోబస్తుని సిద్ధం చేశారు. నర్సీపట్నం డిఎస్పి ప్రవీణ్ కుమార్, రూరల్ సీఐ రమణయ్యతో పాటు గొలుగొండ ఎస్సై నారాయణరావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గొలుగొండ పిహెచ్‌సి వైద్యాధికారి శ్యామ్‌కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. దారమఠం చేరేందుకు బస్సులను ఏర్పాటు చేశారు. మొదటి రోజు సుమారు 20వేల మంది భక్తులు వచ్చినట్లు అంచనా.ఏఎల్‌పురం నీలకంఠేశ్వరస్వామి ఆలయం, చీడిగుమ్మల శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
నర్సీపట్నం రూరల్:
బలిఘట్టంలో బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. పెదబడ్డేపల్లి శివాలయంతో పాటు పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.ఆలయాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.










