Jul 03,2023 19:29

సమావేశంలో మాట్లాడుతున్న రాధాకృష్ణ

ప్రజాశక్తి - ఆదోని
జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి 31 వరకు నిర్వహించే మహా పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పిఎస్‌.రాధాకృష్ణ కోరారు. సోమవారం పట్టణంలోని సుందరయ్య భవన్‌లో ముక్కన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో తాగు, సాగునీటి కోసం ప్రాజెక్టులు నిర్మించాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మెరుగైన విద్య, వైద్యం కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కోరారు. జిల్లావ్యాప్తంగా స్థానిక సమస్యలపై సచివాలయాల్లో వినతిపత్రాలు ఇస్తామన్నారు. ఆదోని పట్టణంలో జనాభా రోజురోజుకు పెరుగుతోందని, అవసరాలకు అనుగుణంగా నీరు సరిపోవడం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న ఎస్‌ఎస్‌ ట్యాంకుకు అదనంగా మరో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నిర్మించాలని కోరారు. సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, పట్టణ కమిటీ నాయకులు గోపాల్‌, తిప్పన్న, వీరేష్‌, వెంకటేష్‌, మునెప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు.