Jun 17,2023 00:32

నిర్వాసితులతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు శ్రీనివాస్‌

ప్రజాశక్తి-విలేకర్ల బృందం
పోలవరం నిర్వాసితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, వరదల బారినుండి ప్రజల్ని కాపాడాలని, గ్రామం చుట్టూ నీరు నిల్వ ఉండే గ్రామాలను కూడా పోలవరం ముంపు జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన ఈ నెల 20 నుండి నిర్వహిస్తున్న పోరుకేక మహాపాదయాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ నాయకులు విలీన నాలుగు మండలాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసి పాదయాత్ర ప్రాధాన్యతను వివరించి ప్రజలను సన్నద్ధం చేస్తున్నారు.
చింతూరు : పాదయాత్రను జయప్రదం కోరుతూ శుక్రవారం మండలంలో పలు గ్రామాల్లో సిపిఎం నాయకులు సమావేశాలు నిర్వహించారు. మధుగూరు గ్రామంలో జరిగిన సమావేశంలో సిపిఎం నాయకులు పల్లపు వెంకట్‌, ఎర్రంశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ గత సంవత్సరం జూన్‌లో వచ్చిన వరదలకు మధుగూరు, సూరనుగొంది రెండు గ్రామాలు గ్రామాల చుట్టూ వరద నీరు చేరిందని తెలిపారు. అధికారులు ఫీల్డ్‌ స్థాయి సర్వేలు చేసి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టు ముంపు నీళ్లు చుట్టుముట్టిన గ్రామాలను కూడా పోలవరం ప్రాజెక్టు ముంపు జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ముంపు మండలాల ప్రజలు అనుభవిస్తున్న సమస్యలను రాష్ట్రం మొత్తం తెలియాలని ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్వాసితులకు పునరావాసం పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు రాజులు, మనోజు, సీతారామయ్య, శేషు, నారాయణ సుందరయ్య, భీము లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.
కూనవరం : పోలవరం నిర్వసితులు 17 సంవత్సరాలుగా వరదల వల్ల ఇబ్బంది పడుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతరామయ్య, జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు విమర్శించారు. కూనవరం పార్టీ కార్యాలయంలో తాళ్లూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పోలవరం కాపర్‌ డామ్‌ బ్యాక్‌ వాటర్‌ వల్ల మండలంలోని అనేక గ్రామాలు ముంపునకు గురై ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. అయినా ప్రభుత్వాలు నష్టపరిహారం ఇవ్వకుండా కాంటూరు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావాసం, ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చిన తరువాతే గ్రామాలను ఖాళీ చేయించాలని డిమాండ్‌ చేశారు. 1986, 2022 నాటి వరద ముంపు ఆధారంగా గ్రామాలను రీ సర్వే చేయాలన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని, గ్రామాలు ఖాళీ చేయించే నాటికీ 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులందరికీ ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం సీనియర్‌ నాయకులు తలగాని నాగరాజు, కుంజా రాధ, నోముల సత్యనారాయణ, కొండా ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.
విఆర్‌.పురం : మండలంలోని ములకనపల్లిలో శాఖ కార్యదర్శి బంగారు ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో చిన్నమట్టపల్లి ఎంపీటీసీ పూనెం ప్రదీప్‌ కుమార్‌, నాయకులు పంకు సత్తిబాబు, తమ్మయ్య కన్నయ్య, నూనె రాముడు, కామయ్య తదితరులు పాల్గొన్నారు.
'పోలవరం పోరుకేక' పోస్టర్‌ ఆవిష్కరణ
ఎటపాక : పోలవరం పోరుకేక మహా పాదయాత్రకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను మండలంలోని నెల్లిపాకలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లిపాక నుండి విజయవాడ వరకు 15 రోజుల పాటు సిపిఎం చేపట్టిన మహా పాదయాత్రలో నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆకిశెట్టి రాము, పులుసు బాలకృష్ణ, ఇరపా సత్యం, అపకా సమ్మక్క, నక్కా సూరిబాబు, ఇమామ్‌, బ్రహ్మం, సరవయ్య, ఊకె బాబు, ప్రవీణ్‌, అశోక్‌, కన్నయ్య, మాటూరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్ర జయప్రదానికి భూ పోరాట కమిటీ పిలుపు
ఎటపాక : మహాపాదయాత్రను జయప్రదం చేయాలని భూపోరాట కమిటీ కన్వీనర్‌ నక్కా సూరిబాబు పిలుపునిచ్చారు. తుమ్మల నగరం గ్రామం కొమురం భీం నగర్‌ ఇంటి స్థలాల పోరాట కమిటీ జనరల్‌ బాడీ సమావేశం సవలం రాము అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో నక్కా సూరిబాబు మాట్లాడుతూ 20న జరిగే పాదయాత్ర, ప్రారంభ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కదిలి వెళ్లి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం నాయకులు బుద్దుల భద్రయ్య, ఇర్ప సత్యం, అపక సమ్మక్క, సోందే సుబ్బారావు, పెనుబల్లి అంజిబాబు, తాటి రమాదేవి, ఉయికె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.