ప్రజాశక్తి- చింతూరు
పోలవరం నిర్వాసితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలంపిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 20 నుండి జులై తేదీ వరకు జరుగు పోలవరం నిర్వాసితుల మహా పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు పల్లపు వెంకట్, ఎర్రంశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మండలంలోని ఎర్రంపేట గ్రామంలో ఆదివారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని, వరదలు వచ్చి నిర్వాసితులు మునిగిపోతుంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని విమర్శించారు. తప్పులు తడకలుగా కాంటూరు లెక్కలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. గత సంవత్సరం వచ్చిన వరదల్లో నిర్వాసితులు సర్వం కోల్పోయారని, ప్రభుత్వ మాత్రం 2000 ఇచ్చి చేతులు దులుపుకుందని పేర్కొన్నారు. వచ్చేనెలలో మళ్లీ వరదలు వచ్చి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇంతవరకు కల్పించలేదని తెలిపారు. దీనిని బట్టి నిర్వాసితులను మళ్లీ వరదల్లో ముంచడానికి ప్రభుత్వం పునుకుందని అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని వీడి నిర్వాసితులకు పునరావాసం కల్పించి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20 నుండి జూలై 5వ తేదీ వరకు జరుగుతున్న మహాపాదయాత్రను నిర్వాసితులందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆరం కొండయ్య, పాండు సుబ్బారావు, కారం రాజయ్య, పాండ్రు పెద్దయ్య, వల్లపు పెద్ద రాములు, తమ్మయ్య, పాండు నాగార్జున, పాండు చిన్న నారాయణ తదితరులు పాల్గొన్నారు.










