Jun 20,2023 00:21

ప్రజాశక్తి-ఎటపాక
పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యాన ఈనెల 20న మంగళవారం మండలంలోని నెల్లిపాకలో ప్రారంభమవుతున్న పోరుకేక మహాపాద్రయాత్రకు నిర్వాసితులు పెద్ద సంఖ్యలో కదులుతున్నారు. ఈ పాదయాత్రకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు యాత్ర మేనేజర్‌ మర్లపాటి నాగేశ్వరరావు ప్రజాశక్తికి తెలిపారు.
పోలవరం నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరావాసం, పరిహారం కల్పించాలని, గోదావరి వరదల నుంచి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని, తప్పుల తడకగా ఉన్న కాంటూరు లెక్కలను మార్చాలని, 1986, 2022 సంవత్సరాలలో గోదావరి వరదలలో మునిగిన గ్రామాలన్నింటినీ మొదటి దఫా పరిహారంలో చేర్చాలని ప్రధాన డిమాండ్లతో సిపిఎం ఈ పాదయాత్రను నిర్వహిస్తుంది. దీని జయప్రదానికి గత 15 రోజులుగా పాదయాత్ర ప్రాధాన్యతను తెలుపుతూ ఎటపాక, చింతూరు, కూనవరం, విఆర్‌.పురం తదితర నాలుగు నిర్వాసిత మండలాల్లోని గ్రామాలలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేశారు. జనరల్‌ బాడీ మీటింగ్‌లు, గ్రూప్‌ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారం, వాల్‌ పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. పలు సమావేశాల ద్వారా అన్ని పార్టీలు, సంఘాలు, వర్గాల మద్దతును కోరారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులు పడుతున్న నష్టాలు, ఇబ్బందులపై సిపిఎం ప్రజలను చైతన్యం చేసి అనేక నిరసనలు ఉద్యమాలు చేయడం జరిగింది. కాని ప్రభుత్వాలు నిర్వాసితులను పట్టించుకోకుండా, వారిని గాలికొదిలేసి ప్రాజెక్టు నిర్మాణంపైనే శ్రద్ధ చూపడంతో నేడు నిర్వాసితుల జీవితాలు ఆగమ్యగోచరంగా మారాయి. ఈ నేపథ్యంలో పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ సిపిఎం ప్రారంభిస్తున్న మహా పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుంది. 15 రోజుల పాటు 400 కిలోమీటర్లు మేరకు సాగే ఈ పాదయాత్ర జులై 4న విజయవాడలో ముగియనుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నాయకత్వంలో ఈ పాదయాత్రలో జరగనుండడంతో దీనిని జయప్రదం చేయడానికి పార్టీ శ్రేణులన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.