ప్రజాశక్తి-కాకినాడ రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయం, దళిత సమస్యల పరిష్కారం కోసం కెవిపిఎస్, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య భవనంలో మహాధర్నా పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మల్యాద్రి, వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి కెఎస్.శ్రీనివాస్ మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లుపూర్తి చేసుకున్న ఈ రాష్ట్రంలో జిల్లాలో కుల వివక్ష అనేక రూపాల్లో విలయతాండవం చేస్తోందన్నారు. దళితుల చట్టాలను నీరుగార్చే పద్ధతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి కాబట్టి దీనికి వ్యతిరేకంగా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉద్యమించి దళిత చట్టాలను కాపాడుకోవాల్సిన అవసరంఉందన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే 41 సిఆర్‌పిసి ప్రకారం బెయిల్ ఇవ్వడాన్ని రద్దు చేయాలని, అట్రాసిటీ కేసుల్లో నిందితుల ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధితులకు నష్టపరిహారంగా ఇచ్చే విధంగా చట్టాన్ని రూపొందించాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలనే తదితర డిమాండ్లతో ఈ నెల 29న విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి మోర్త రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరావు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు బుడితి సురేష్ కుమార్, జిల్లా కార్యదర్శి కె.సింహాచలం, సిఐటియు క్లస్టర్ కన్వీనర్ టి.రాజా తదితరులు పాల్గొన్నారు.










