ప్రజాశక్తి-కోటనందూరు 20 రోజుల నుంచి విస్తారంగా ఎండలు కాయడంతో వరి పొలాలు ఎండిపోయి బీటలు వాడడంతో మెట్ట ప్రాంత రైతులు గగ్గోలు పెడుతున్నారు. జూన్, జూలై నెలలో అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల మండలంలో అల్లిపూడి, కాకరాపల్లి, గ్రామాలలో వరినట్లు వేశారు. మరో ఎనిమిది గ్రామాల్లో నారుమళ్లు వేయడానికి దుక్కులు దున్ని విత్తనాలు చల్లారు. మరికొన్నిచోట్ల దుక్కులు దున్నారు. బోర్లు సదుపాయం ఉన్న పల్లపు ప్రాంతాల్లోనూ వరి నాట్లు వేశారు. ఆగస్టు మొదటి వారం నుంచి విస్తారంగా ఎండల కాయడం వల్ల ఆకుమళ్లు ఎండిపోయాయి, వరి నాట్లు వేసిన పంట పొలాలన్నీ బీటలు వారాయి. తొక్కుదిండిన వరి పొలాలన్నీ ఎండిపోయాయి. దీనితో దిక్కుతోచని పరిస్థితుల్లో మెట్ట ప్రాంత రైతాంగం తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే వరి విత్తనాలు క్రిమిసంహారక మందులు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. డీజిల్ ధరలు అధికంగా పెరిగిపోవడంతో ట్రాక్టర్‌తో దుక్కు దున్నడానికి ఒక్కొక్క గంటకు రూ.1100 వరకు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఒక్కక్క ఎకరానికి రూ.15000 వరకూ పెట్టుబడి పెట్టామన్నారు. కష్టపడి పంటలను సాగు చేస్తున్నప్పటికీ వాతావరణం సహకరించకపోవడంతో వరి పంటలన్నీ ఎండిపోయి బీటలు వారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలోనే హంస పోతున్నట్లుగా తొలి దశలోనే పొలాలు ఎండిపోవడంతో ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.










