Sep 21,2023 21:08

కోట జంక్షన్‌లో మానవహారం చేస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  సంక్షేమ హాస్టళ్లలో మెస్‌ఛార్జీలు పెంచాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థులు గురువారం నగరంలోని కోట జంక్షన్‌ వద్ద బిక్షాటన, అనంతరం మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి డి.రాము, ఉపాధ్యక్షులు ఎం.సౌమ్య మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో వినూత్న మార్పులు తెస్తామని చెబుతూ అదే విద్యారంగాన్ని తుంగలోకి తొక్కు తున్నాయని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవడం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌ ఛార్జీలు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. అద్దె బిల్డింగుల పేర్లతో ఆర్‌ఒ ప్లాంట్‌ పెట్టకపోవడం సరికాదన్నారు. భవనాలు శిథిలావస్థకు చేరినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్‌ , జిల్లా కమిటీ సభ్యులు పి.రమేష్‌రాజు, నాయకులు భారతి, సంధ్య, సుష్మిత విద్యార్థులు పాల్గొన్నారు.