Sep 11,2023 23:49

ప్రజాశక్తి - పెద్దాపురం విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని కాకినాడ జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 8 నుండి 14 వ తేదీ వరకు తుని నుండి కాకినాడ వరకు చేపట్టిన విద్యార్థి సంగ్రామ సైకిల్‌ యాత్ర సోమవారం సాయంత్రం పెద్దాపురం చేరుకుంది. జగ్గంపేట నుండి పెద్దాపురం వచ్చిన ఈ సైకిల్‌ యాత్రలో భాగంగా విద్యార్థి వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరహాలు,ఎం గంగా సూరిబాబు లు మాట్లాడుతూ పాఠశాలల నుండి యూనివర్సిటీల స్థాయి వరకు అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు తిరోగమన దశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేటీకరించేందుకు కృషి చేస్తున్నాయన్నారు. స్థానిక గురుకుల పాఠశాలలో ఒకే గదిలో 40 నుండి 50 మంది విద్యార్థులు ఉంటూ అవస్థలు పడుతున్నారన్నారు. మిగిలిన బాలురు, బాలికల వసతి గృహాల్లో అనేక సమస్యలు తాండవిస్తున్నాయన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు మణికంఠ, గోపాల్‌, పవన్‌, నాని, అరుణ్‌, శివరాజ్‌, ఆదర్శ్‌, సతీష్‌, సంతోష్‌, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.