Jun 10,2023 20:53

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఆదోని
వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో మెరుగైన విద్యనందించాలని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌ రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని శక్తి గుడి ఏరియాలో శ్రీజీహ్వేశ్వర ఇంగ్లీష్‌ మీడియం స్కూలును ప్రారంభించారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ శాంత జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పేద పిల్లలకు మెరుగైన విద్యనందించే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అమ్మబడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, విద్యా కానుక అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ, ప్రయివేట్‌ తారతమ్యం లేకుండా పేద విద్యార్థులందరికీ ఆర్థిక ప్రయోజిత పథకాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసిన చంద్రబాబు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం పచ్చి మోసమని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఆదోని ప్రజల సహకారంతో మరోసారి ఎమ్మెల్యేగా సేవలందిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ మజర్‌ అహ్మద్‌, సంఘం నాయకులు నాగరాజు, లక్ష్మన్న, గోవిందరాజులు ఉన్నారు.