ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: సూర్యలంక సముద్ర తీరానికి వచ్చే యాత్రికులకు మెరుగైన రక్షణ కల్పించడం కోసం వాచ్ టవర్లను నిర్మించామని ఎస్‌పి వకుల్ జిందాల్ తెలిపారు. మంగళ వారం ఆయన సూర్యలంక సముద్రతీరంలో నిర్మాణం పూర్తి కావస్తున్న 3 వాచ్ టవర్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ నూతన బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత సూర్యలంక సముద్ర తీరానికి యాత్రికులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నందున వారి రక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తీరం వెంబడి పోలీస్ సిబ్బంది గస్తీని పెంచామన్నారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సముద్ర తీరంలో గజ ఈతగాళ్లను నియమించామన్నారు. వారు ఇటీవల కాలంలో అనేక మంది యాత్రికుల ప్రాణాలను కాపాడారన్నారు. సముద్ర తీరంపై మరింత నిఘా ఉంచి యాత్రికుల రక్షణకు మెరుగైన చర్యలు తీసుకోవడం కోసం సూర్యలంక సముద్రతీరం వెంబడి 3 వాచ్ టవర్ల నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేశామన్నారు. ప్రస్తుతం టవర్ల నిర్మాణం పూర్తి కావస్తోందన్నారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డిఎస్పీ టి వెంకటేశులు, బాపట్ల మెరైన్ సిఐ జి సుబ్బారావు, ఎస్‌బి సిఐ ఏ శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్‌ఐ బి శ్రీకాంత్ నాయక్ ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.










