ప్రజాశక్తి -మునగపాక రూరల్
అనకాపల్లి- అచ్చుతాపురం రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న తోటాడ రెవెన్యూ పరిధిలోని నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని నిర్వాసితుల సంఘం కన్వీనర్ ఎస్ బ్రహ్మాజీ డిమాండ్ చేశారు. మండలంలోని ఒంపోలు గ్రామంలో బాధిత రైతులతో మంగళవారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ మంగళవారం సాయంత్రం భూములు కోల్పోతున్న బాధిత రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తానని పిలుపు ఇవ్వడంతో రైతులు నిర్వాసితులు తమ పనులను వాయిదా వేసుకుని ఎదురు చూశారని తెలిపారు. కాని ఆర్‌డిఒ గైర్హాజరు కావడం సరికాదని పేర్కొన్నారు. నిర్వాసితులందరికీ గజానికి రూ.25 వేలు చొప్పున చెల్లించాలని, నిర్వాసితుల కుటుంబంలో ఒకరికి ఎస్‌ఇజెడ్‌లో ఉపాధి కల్పించాలని, ఆర్ అండ్ బిలో ఉపాధి కోల్పోతున్న చిరు వ్యాపారులకు న్యాయబద్ధమైన పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.










