ప్రజాశక్తి-ఉయ్యూరు : మెరుగైన పౌష్టికాహారంతోనే ఆరోగ్యం,చక్కటి విద్యాభ్యాసం సాధ్యమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథక అమలు తీరును స్వయంగా తెలుసుకు నేందుకు కానూరు ఏఎస్‌ఎన్‌ఆర్‌ఏ జిల్లా పరిషత్ హైస్కూల్‌ను గురువారం కలెక్టర్ పి. రాజాబాబు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ గోరుముద్ద పధకం పరిశీలనలో భాగంగా రాగిజావ స్వయంగా సేవించానని అది ఎంతో రుచిగా సంతప్తికరంగా ఉందన్నారు. గోరుముద్ద పథకం కార్యక్రమాన్ని మరింతగా పటిష్టం చేసేందుకు ప్రభుత్వం గత ఆరునెలలుగా రాగిజావ సైతం పిల్లలకు అందజేస్తుందన్నారు. పిల్లలకు ఐరన్, కాల్షియం ఈ ఆహారం ద్వారా సమకూరి వారు బలంగా ఎత్తుగా పెరగడానికి ఎంతగానో ఉపయోగపడు తుందన్నారు.1 వ తరగతి నుంచి 10 తరగతి పిల్లలకు కష్ణాజిల్లాలో ప్రభుత్వం 1300 స్కూళ్ళల్లో దాదాపు లక్ష మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందజేస్తోందన్నారు. స్కూల్ పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందిస్తుందని తెలిపారు. గుడ్డు, చిక్కీ సహా అందిస్తున్న 15 ఆహార పదార్థాలకు ఇది అదనపు పౌష్టికాహారమని కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి తాహెరా సుల్తానా, డివైఈవో పద్మ రాణి, కానూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానో పాధ్యాయురాలు విజయలక్ష్మి , పలువురు హైస్కూల్ ఉపా ధ్యాయినీ ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులున్నారు.










