ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ : విద్యార్థులకు ప్రత్యక్ష జ్ఞానం, మెరుగైన నైపుణ్యాలు అందించడం వల్ల ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతాయని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఆచార్య కె.రామమోహనరావు అన్నారు. శనివారం ఉదయం ఎన్‌ఇపి 2020 ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీస్ ఫర్ క్వాలిటీ ఎన్‌హాన్స్‌మెంట్ అంశంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం దీనిని కార్యరూపంలో చూపుతూ 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను అందిస్తున్న విధానం వివరించారు. అనుబంధ కళాశాలలు నాక్ గుర్తింపును పొందే విధానం వివరించారు. దీనిపై కళాశాలలకు అనేక అపోహలు, సందేహాలు ఉన్నాయనే అంశాన్ని ప్రస్తావిస్తూ వాటిని నివృత్తి చేశారు. కళాశాలకు అవసరమైన భవనం, తరగతిగదులు, మౌలిక వసతులు ఉన్న కళాశాలలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. బోధన సిబ్బంది అంశంలో ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. కరికులం అమలు చేసే బోధన సిబ్బంది ఉన్న ప్రతి కళాశాలా నాక్ గుర్తింపుకు వెళ్లవచ్చన్నారు. ఐదేళ్ల కాలానికి నాక్ గుర్తింపును పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధానాలను వివరించారు.
వీసీ ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి మాట్లాడుతూ, అనుబంధ కళాశాలలు త్వరలో నాక్ గుర్తింపును సాధించాల్సిన అవసరం ఉందన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్ మాట్లాడుతూ, గ్లోబల్ మార్కెట్‌కు ఉపయుక్తంగా యువతను తయారుచేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. టెక్నాలజీని విద్యలో మిళితం చేయాలని సూచించారు. వివిధ ర్యాంకింగ్ సంస్థలకు అందించే సమాచారంలో స్పష్టత, ఖచ్చితత్వం కలిగి ఉండాలన్నారు. రెక్టార్ ఆచార్య కె.సమత మాట్లాడుతూ, అందరికీ నాణ్యమైన విద్యను అందించడం నూతన విద్య విధానం 2020 లక్ష్యమన్నారు. నాలెడ్జ్ సూపర్ పవర్‌గా భారత్ నిలుస్తుందన్నారు. నాక్ గుర్తింపు నాణ్యతకు చిహ్నంగా నిలుస్తుందనే విషయం గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ లెవెల్ నాక్ చైర్మన్ ఆచార్య కె.రాంజీ, ఆచార్య పి.సునీత, ఆచార్య కె.సీతామాణిక్యం తదితరులు ప్రసంగించారు.










