Feb 27,2023 00:00
విజేతలకు బహుమతులు అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-అద్దంకి: పట్టణంలోని రామసుశీల నిలయంలో ఎడ్యుకేషనల్‌ ఎపిఫని మెరిట్‌ టెస్ట్‌-2023 విజేతలను పుట్టంరాజు బుల్లెయ్య, రామ లక్ష్మమ్మల ఛారిటబుల్‌ ట్రస్టు పక్షాన ప్రోత్సాహక బహుమతులతో ఆదివారం సత్కరించారు. బాపట్ల, ప్రకాశం, పలనాడు జిల్లాలకు చెందిన విజేతలు 15 మందికి 20 వేల రూపాయల విలువ చేసే ఎడ్యుకేషనల్‌ మెటీరియల్‌ అంద జేశారు. ఈ కార్యక్రమానికి పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షత వహించారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ టి వెంకట్రావు సంస్థ లక్ష్యాలను, ఆశయాలను సభకు వివరించారు. ఎలాంటి రుసుము లేకుండా ఆన్‌లైన్‌ విధానం లో 7వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిర్వహించి 9 లక్షలకు పైచిలు కు నగదు బహుమతులు అందించిన ఏకైక ఎన్‌జివో సంస్థ ఎపిఫని సంస్థ అని కన్వీనర్‌ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదనే లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ ఎపిఫని అని దిడ్లాస్వామి అన్నారు. ప్రభుత్వ పాఠశాల కోసం పనిచేస్తూ, విద్యార్థుల ప్రతిభకు పట్టం కడుతున్న సంస్థగా ఎపిఫనిని స్టేట్‌ కో ఆర్డినేటర్‌ దూదేకుల నబి అభివర్ణించారు. ఐఎఎస్‌ తరహాలో ఈ మెరిట్‌ టెస్ట్‌ నిర్వహించడం ద్వారా రాబోయే కాంపిటే టివ్‌ పరీక్షలను విద్యార్థులు ఆత్మస్థైర్యంతో రాస్తారని, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు కూడా ఈ టెస్టులు ఉపయోగపడతాయని తిమ్మాయ పాలెం ప్రధానోపాధ్యాయులు కెవి శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో నన్నెబోయిన రాఘవ, కె పోలిరెడ్డి, సిహెచ్‌ పద్మావతి, శ్యాంబాబు, శివప్రసాదు, శ్రీకృష్ణ, చుండూరి మురళీ సుధాకర్‌, లక్కరాజు విశ్వమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాపట్ల, ప్రకాశం, పలనాడులకు చెందిన ఈఈ మెరిట్‌ టెస్ట్‌-2023 విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.