Sep 26,2023 00:13

మెరైన్‌ మ్యూజియాన్ని ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : బీచ్‌ రోడ్డులోని ఫిషరీస్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఆధునికీకరించిన మెరైన్‌ మ్యూజియాన్ని కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాదాపు 250 రకాల జలచరాల నమూనాలను శాస్త్రీయంగా భద్రపరిచిన మ్యూజియం అని తెలిపారు. మత్స్య సంపదకు సంబంధిత రంగాల్లో పరిశోధనలు చేసేవారికి, సైన్స్‌ విద్యార్థులకు బోధనాంశంగా దోహదపడేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దారని చెప్పారు. అనంతరం కేంద్రమంత్రి మత్స్యపరిశ్రమాభివృద్ధిలో ప్రస్తుత పరిస్థితులను ఆయా రంగాల నిపుణలతో కలిసి చర్చించారు. మత్స్య ఉత్పత్తుల విషయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎదురయ్యే పోటీ, మన దేశ ఉత్పత్తులకు పెరుగుతోన్న వ్యయం గురించి మంత్రికి పలువురు వివరించారు. ఫిషరీ సర్వే ఆఫ్‌ ఇండియాకు కావాల్సి మౌలిక వసతులు, కొత్త సర్వే నౌకలు, పరిశోధనలకు ప్రభుత్వం నుంచి అందించే తోడ్పాటు గురించి శాస్త్రవేత్తలకు వివరించారు. అనంతరం సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, నాటికల్‌, ఇంజినీరింగ్‌ ట్రైనింగ్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ, శిక్షణ సంస్థలను సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జివిఎల్‌ నరసింహారావు పాల్గొన్నారు.