
ప్రజాశక్తి - రేపల్లె
మెప్మాలో రూ.కోటికిపైగా అవినీతికి పాల్పడిన దోషులను మెప్మా జిల్లా స్థాయి అధికారులు రక్షించటం సిగ్గుచేటని సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ అన్నారు. స్థానిక సీపీఎం కార్యలయం కొరటాల మీటింగ్ హాల్లో మోసపోయిన డ్వాక్రా మహిళలు సమావేశం ఐద్వా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. గత రెండు నెలల నుంచి అనేక రూపాలలో ఆందోళన చేయటంతో తప్పని పరిస్థితుల్లో జిల్లా అధికారులు, మేప్మా పీడీ డిపార్ట్మెంట్ విచారణ చేశారని అన్నారు. అవినీతికి పాల్పడిన వారిని సస్పెండ్ చేస్తామని హామీలు ఇచ్చారని అన్నారు. అయితే వాస్తవాలు కనీసం పోలీస్ స్టేషన్లో కూడా చెప్పాకుండా ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారికి అండగా ఉంటూ మెప్మా జిల్లా పీడీ, స్థానిక మెప్మా అధికారులు అవినీతిని గోప్యంగా ఉంచుతూ కొంత సమాచారం మాత్రమే పోలీసు స్టేషనలో ఇచ్చినట్లు ఆరోపించారు. మెప్మా పీడీ పేద మహిళలకి ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. అవినీతికి కారణమైన మెప్మా అధికారులను, అప్పటి సిఓలు, సిఎంఏంలను సస్పెండ్ చేస్తామని, మోసపోయిన మహిళలకు బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా డ్వాక్రా గ్రూపుల్లో కొనసాగిస్తామని, అవినీతి జరిగిన నేపథ్యంలో పేద డ్వాక్రా మహిళలకు బ్యాంకర్స్ నుంచి ఒత్తిడి లేకుండా చూస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మోసపోయిన డ్వాక్రా మహిళల కుటుంబాల్లో బ్యాంకుల నుండి ఒత్తిడి రావడంతో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు శరణ్యం అంటూ వాపోతున్నారని అన్నారు. అయినా కనీసం మానవత్వంతో కూడా మెప్మా అధికారులు స్పందించడంలేదన్నారు. కాలం గడుపుతు మోసం చేసిన వారికే మద్దతుగా ఉన్నారని ఆరోపించారు. గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు పిర్యాదు చేస్తే పరిష్కారమైనట్లు సంతకాలు చేయాలని మెప్మా అధికారులు ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని మహిళలను కాపాడే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి షేక్ ఆశ, ఉపాధ్యక్షులు కె నాంచారమ్మ, కోశాధికారి షబానా సుల్తానా, మోసపోయిన డ్వాక్రా మహిళలు, సీపీఎం నాయకులు కెవి లక్ష్మణరావు, కె ఆశ్విరాధం పాల్గొన్నారు.