ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : మహిళలు తమ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచుకునేందుకు ప్రభుత్వం అందజేస్తున్న పొదుపు రుణాలు కొందరి స్వార్ధం కారణంగా పక్కదారి పడుతున్నాయి. కోట్లాది రూపాయల మేర అవినీతి జరగుతున్నా ఎలాంటి చర్యలూ ఉండటంలేదు. అవినీతి ఘటనలు వెలుగు చూసిన సందర్భాల్లో విచారణ జరుపుతున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అవినీతి, అక్రమాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి.
బాపట్ల జిల్లా పరిధిలోని పురపాలక సంఘాల్లోని మెప్మా విభాగంపై వరుసగా ఆరోపణలు వస్తున్నాయి. వీటికి వీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ఉండటం లేదు. మెప్మా విభాగంలోని రీసోర్సు పర్సన్లు(ఆర్‌పిలు) కమ్యూనిటీ ఆర్గనైజర్లు(సిఒలు) బ్యాంకు ఉద్యోగుల సహకారంతో ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది.
పొదుపు రుణాల్లో అవకవతకలు ఇలా...
ఆర్‌పిలు, సిఒలు పొదుపు గ్రూపుల్లోని సభ్యులుగా కొంతమంది మహిళలను డమ్మీలుగా పెడుతున్నారు. తమ కోసమే డమ్మీ గ్రూపులను సృష్టిస్తున్నారు. నకిలీ ఆధార్‌లు పెట్టి ఆన్‌లైన్ చేయకుండా బ్యాంకుల నుంచి రుణం పొందుతున్నారు. పట్టణంలో ఒక వార్డు గ్రూప్ సభ్యులు ఒకచోట వారై ఉండాలి. కానీ వేరువేరు ప్రదేశాల్లో ఉన్న వారిని వేరే ఊరిలో ఉండే వారిని కూడా పెట్టి గ్రూప్‌లు చేస్తూ అక్రమంగా బ్యాంక్ రుణాలు పొందుతున్నారు. బ్యాంకు నుంచి రుణం పొందిన తర్వాత కొంతకాలం గ్రూప్ సభ్యులు, డబ్బులు పంచుకున్న వారు సక్రమంగా రుణం చెల్లిస్తారు. ఆ తర్వాత రుణ వాయిదాలు కట్టరు. గ్రూపు సభ్యుల్లో గొడవలు అని, సభ్యులు లేరు వేరే ఊరు వెళ్లిపోయారని ఏదో కారణాలు చూపించి కాలం నెట్టుకొస్తారు. చివరికి బ్యాంకు వారిచేత వన్ టైం సెటిల్మెంట్‌కు ఒప్పించి కొద్ది మొత్తం చెల్లించడం లేదా గ్రూపు రద్దు అని చెప్పి మరో బ్యాంక్‌లో అదే గ్రూపు పేర్లతో కొత్తగా రుణం పొందుతున్నారు. చీరాల, రేపల్లే పురపాలక సంఘాల పరిధిలో ఒక్కోక్క మెప్మా విభాగం సుమారు 200 చొప్పున డమ్మీ పొదుపు గ్రూపులున్నట్లు తెలుస్తుంది. బాపట్ల, అద్దంకి పురపాలక సంఘాల పరిధిలో కూడా 100కు పైగా డమ్మీ పొదుపు గ్రూపులున్నట్లు సమాచారం.
అధికార పార్టీ సభల సమీకరణలో
ఆర్‌పిలు, సిఒల సహకారం
అధికార పార్టీ ఏర్పాటు చేసే సభలు జయప్రదం కావాలంటే పొదుపు గ్రూపుల మహిళలు తరలి రావాలి. వారు రాకుంటే మంత్రులు, ముఖ్యమంత్రుల సభలు నిండవు. జనసమీకరణ కోసం అధికార పార్టీ నేతలు ఆర్‌టిసిలు, సిఒలపై ఆధార పడతారు. ఎన్నికల సమయంలోనే ఓట్ల కోసం కూడా వీరిపైనే నేతలు ఆధారపడుతున్న పరిస్థితి ఉంది.పొదుపు రుణాల్లో జరిగే అవకతవకల్లో కొన్ని చోట్ల కౌన్సిలర్ల పాత్ర కూడా ఉంటుంది. ఈ కారణంగా పొదుపు గ్రూపుల్లో ఆర్‌పిలు, సిఒలు అవినీతికి పాల్పడినా నేతలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉంది.










