Apr 21,2023 01:19
మెప్మా కార్యాలయంలో విచారణ చేస్తున్న బాపట్ల జిల్లా పీడీ

ప్రజాశక్తి-రేపల్లె: స్వయం సహాయక సంఘాల పేరుతో వివిధ బ్యాంకులలో రుణాలు పొంది, చెల్లించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ పేదరిక నిర్ములనా సంస్థ బాపట్ల జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకట నారాయణ హెచ్చరించారు. పురపాలకసంఘం ఆధ్వర్యంలోని మెప్మాలో ఇటీవల జరిగిన అవకత వకలపై గురువారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణం లోని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రేపల్లె శాఖలో నిరక్షరాస్యుల పేరుతో రుణాలు పొందిన మాట వాస్తవమే అన్నారు. మొత్తం జీడిసిసి బ్యాంకులో 11 గ్రూపులు 2021లో సుమారు 36 లక్షల 53 వేల రూపాయలు రుణాలు పొందారని తెలిపారు. వీటిలో 7 గ్రూపులకు గాను 8 లక్షల రూపాయలు రికవరీ అయ్యాయని, మరో నాలుగు గ్రూపుల కింద రూ.28 లక్షలు రికవరీ చేయాల్సి ఉందని అన్నా రు. రుణాలు పొంది రికవరీ చేయని గ్రూపులకు ఇప్పటికే నోటీసులు అందజేసినట్లు తెలిపారు. బ్యాంకు రుణాల కుంభకోణంలో సీఓల పాత్ర లేదన్నారు. మెప్మాలో పనిచేస్తున్న కొందరు గ్రూప్‌ సభ్యులు ఆర్పీని ప్రసన్నం చేసుకుని అడ్డదారుల్లో రుణాలు పొందినట్లు వివరించారు. బ్యాంకు అధికారులు సభ్యులకు రుణాలు మంజూరు చేసేటప్పుడు మెప్మా వెబ్‌సైట్‌లో పొదుపు సంఘాల ఆధార్‌ సీడింగ్‌ ను పరిశీలించాలని తెలిపారు. బ్యాంకులకు తప్పుడు సమాచారం అందించి రుణాలు పొందినవారు తక్షణం చెల్లించేలాగా బ్యాంకు అధికారులు మెప్మా సిబ్బంది ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. రికవరీ చెయ్యని వారిపైనే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మెప్మా సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ విజయ సారథి, మెప్మా సీఎంఎం సుగుణ, ఆర్పీలు పాల్గొన్నారు.