- మోసపోయిన మహిళలకు న్యాయం చేయాలి
- మెప్మా అధికారులపై చర్యలు తీసుకోవాలి
ప్రజాశక్తి- రేపల్లె
నకిలీ గ్రూపులు సృష్టించి మహిళల పేరుతో అక్రమంగా రూ.కోటి రుణాలు కాజేస్తే బాధ్యలుపై చర్యలు తీసుకోకుండా, మోసపోయిన మహిళలుకి న్యాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మెప్మా అధికారులపై చర్యలు తీసుకోవాలని మెప్మా ఆఫీసులో మోసపోయిన మహిళలు, ఐద్వా మహిళా సంఘం ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతుగా సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సీహెచ్ మణిలాల్ మాట్లాడారు. దొంగ గ్రూపులు పేరుతో మెప్మా ఆర్పీ, అప్పటి సిబ్బంది రుణాల అవినీతికి పాల్పడిన విషయం 20రోజులు క్రితం వెలుగులోకి వస్తే ఇప్పటికీ శాఖాపరమైన విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులకు పిర్యాదు చేయాల్సిన మెప్మా జిల్లా అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అవినీతికి పాల్పడ్డ ముద్దాయిలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. రెండు రోజుల్లో కేసు బుక్ చేస్తామన్న మెప్మా పిడి పదిరోజులైనా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. బ్యాంకర్లతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని, సొమ్ము రికవరీ చేయిస్తామని ఇచ్చిన హామీ ఒక్కటీ అమలు కాలేదని అన్నారు. దొంగ గ్రూపులతో రుణాలు కాజేశారని రుజువైనప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని మెప్మా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మెప్మా పిడి వెంకట నారాయణ ఫోన్‌లో మాట్లాడారు. స్థానిక మెప్మా మేనేజర్ విజయ రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం కోసం పూర్తి డిపార్ట్మెంట్ ఎంక్వయిరీ పూర్తి చేస్తామని తెలిపారు. ఆర్పీ ద్వారా డబ్బులు కట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అప్పటి సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకొంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. భవిష్యత్తులో అధికారులు చెప్పిన పద్ధతుల్లో వ్యవహరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి షేక్ ఆశా, అధ్యక్షురాలు షేక్ జహీదా, గౌరవాధ్యక్షురాలు ఆర్ నాగమణి, ఉపాధ్యక్షులు కె నాంచారమ్మ, కోశాధికారి షబానా సుల్తానా, సిపిఎం నాయకులు కె ఆశీర్వాదం, కె రమేష్ పాల్గొన్నారు.










