Aug 30,2023 21:37

బాలికోన్నత పాఠశాలలో స్టాక్‌ను పరిశీలిస్తున్న ఎటిడబ్ల్యుఒ సురేష్‌కుమార్‌

ప్రజాశక్తి - కొమరాడ : వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ ఎటిడబ్ల్యూ బి.సురేష్‌ కుమార్‌ అన్నారు. బుధవారం స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ భాలికోన్నత పాఠశాల, ఉలిపిరి గిరిజన సంక్షేమాశ్రమ బాలిక ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా వసతిగృహంలో వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం స్టోర్‌రూమ్‌లో ఉన్న సామాగ్రికి రికార్డులను నమోదు చేసిన అంశాలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులకు వండి పెట్టే భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెనూ అమలు చేస్తుందన్నారు. విద్యార్థులకు మినీ ప్రకారం మూడు పూటలా భోజనంతో పాటు పండ్లు, స్వీట్లు, స్నాక్స్‌ సక్రమంగా అందజేయలన్నారు. భోజనం వండే సమయంలో వంట దగ్గరకు వెళ్లి వార్డెన్లు బాధ్యతగా పర్యవేక్షించాలని సూచించారు. భోజనం వండేటప్పుడు ఎటువంటి నిర్లక్ష్యం ఊహించకుండా రుచిగా నాణ్యమైన భోజనాన్ని ఉండాలని నిర్వాహకులకు సూచించారు. వసతి గృహాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వస్తారు కాబట్టి రికార్డులన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. నాణ్యత పాటించకుండా మెనూ అమలు చేయకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం భోజనం సక్రమంగా పెడుతున్నారా లేదా అన్న వివరాలు విద్యార్థినిలకు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు వార్డెన్లు ఉన్నారు.